ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవలేదు. గెలవడం పక్కన పెడితే, కనీసం డ్రా కూడా చేసుకోలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. లంచ్ అనంతరం కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, 450కిపైగా టార్గెట్ సెట్ చేయాలన్నది ఆసీస్ ప్రణాళిక కావచ్చు. క్రీజ్‌లో లబూషేన్ (41), గ్రీన్ (7) ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్‌యాదవ్ తేలిపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉమేశ్‌ను అనవసరంగా తీసుకున్నారని మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో తెలుసుకోకుండా ఉమేశ్‌ను లండన్ ఫ్లైట్ ఎక్కించారని ఆరోపిస్తున్నారు.
షమీ, సిరాజ్ స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్లుగా ఉన్నప్పుడు, ఉమేశ్‌ను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. ఆసీస్ టాపార్డర్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాటర్ల కలయికతో ఉంటుందని తెలిసినప్పుడు, మూడో పేసర్‌గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను తీసుకోవాల్సి ఉండిందని అంటున్నారు. ఉనద్కత్‌పై కూడా సదభిప్రాయం లేనప్పుడు మ్యాచ్ విన్నర్, అనుభవజ్ఞుడైన అశ్విన్‌ను అయినా తీసుకోవాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
జట్టులో మిగతా ఆటగాళ్లంతా ఏదో ఒక రకంగా అయినా ఉపయోగపడ్డారని.. ఉమేశ్ తన పాత్రకు కనీస న్యాయం కూడా చేయలేకపోయాడని మండిపడుతున్నాడు. ఒకవేళ టీమిండియా ఓడిపోతే, దానికి ప్రధాన కారణం ఉమేశ్‌యాదవే అవుతాడని అంటున్నారు. స్పిన్నర్లుకు ఏ మాత్రం సహకరించని పిచ్‌పై జడేజా 3 వికెట్లు తీస్తే.. ఉమేశ్ 30 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఓవరాల్‌గా ఉమేశ్‌ను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు.
స్కోర్ వివరాలు..
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108)
- భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83)
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 123/4 (లబూషేన్ 41 బ్యాటింగ్, జడేజా 2/25)
ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది
చదవండి: ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment