నెల్లూరు(బృందావనం) : నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణంలో రూ.6 కోట్ల అవినీతి జరిగిందంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను వారే నిరూపించలేక తోకముడిచారు. అయితే వారికి దీటుగా తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదంటూ ఆలయ పాలకమండలి గౌరవాధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ సవాలు విసిరి గురువారం ఆలయంలో ప్రమాణం చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ప్రమాణం చేయకుండా జారుకున్నారు.
అసలేం జరిగిందంటే..
రెండు రోజుల క్రితం కర్నూలులో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అక్కడి ఆర్యవైశ్య సంఘీయులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీకి చెందిన ఆర్యవైశ్యులు పలు ఆరోపణలు చేశారు. దీనిని నెల్లూరులో ముక్కాల ద్వారకానాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో టీడీపీకి చెందిన ఆర్యవైశ్య ప్రతినిధులు అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నుడా చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌తో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయ పాలకమండలిని లక్ష్యంగా చేసుకుని ఆలయ నిర్మాణ నిధుల్లో రూ.6 కోట్ల మేరకు ప్రస్తుత పాలకమండలి స్వాహా చేసిందని ఆరోపించారు. దీనిపై చర్చపెట్టాలని, నిజం నిగ్గుతేల్చాలని బుధవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
నిగ్గు తేలుస్తామని సవాల్
టీడీపీ ఆరోపణలను ద్వారకానాథ్ నిగ్గు తేలుస్తానని గురువారం ఉదయం 11 గంటలకు అమ్మవారి ఆలయానికి రావాలని, గర్భాలయంలో అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో గురువారం ఉదయం 10:58 గంటలకు ద్వారకానాథ్‌తో పాటు పాలకమండలి సభ్యులు, కుటుంబసభ్యులతో గర్భాలయంలోకి వచ్చారు. టీడీపీ నేతలు షణ్ముఖరావు, ప్రవీణ్, హరికృష్ణ, బ్రహ్మంగుప్తా, కోట మధు మరో ఏడుగురు ఉదయం 11.38 నిమిషాలకు ఆలయానికి వచ్చారు. మొదట ద్వారకానాథ్ నేతృత్వంలో పాలకమండలి సభ్యులు, కుటుంబసభ్యులు అమ్మవారి సాక్షిగా తాము అవినీతి, అక్రమాలకు పాల్పడలేదంటూ ప్రమాణం చేశారు. అనంతరం టీడీపీ ఆర్యవైశ్య నేతలు గర్భాలయంలో ప్రమాణం చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని కోరారు. అయితే కులదైవం పేరుతో ప్రమాణం చేసేందుకు టీడీపీ ఆర్యవైశ్య నేతలు నిరాకరించారు. ఆలయం వెలుపల చర్చ జరగాలంటూ పసలేని ఆరోపణలకు పనిబెట్టారు. దీంతో మాటామాటా పెరిగి గందరగోళ పరిస్థితి నెలకొని తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో రంగప్రవేశం చేసి ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా నిలువరించారు. టీడీపీ నాయకులను ఆలయం వెలుపలికి పంపించేశారు.
దమ్ము, ధైర్యం లేక పారిపోయారు
అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం లేక టీడీపీ నేతలు పారిపోయారని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ పాలకమండలి గౌరవాధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఎద్దేవా చేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి 550 మంది దాతలు ఉన్నారన్నారు. పునాది నుంచి గోపురాల నిర్మాణాల వరకు ప్రతి విషయాన్ని పకడ్బందీగా రికార్డు చేసి ఉన్నామన్నారు. సమావేశంలో ఆలయ పాలకమండలి చైర్మన్ సుంకు మనోహర్, కార్యదర్శి ఐతా రామచంద్రరావు, సభ్యులు సూర్యనారాయణ జేవీఆర్‌శ్రీను, శ్రీనివాసులు, భాస్కర్, సుబ్రహ్మణ్యం, శరణ్‌కుమార్, శ్రీరామ్‌సురేష్, గోపాల్, వివిధ సంఘాలకు చెందిన ఆర్యవైశ్య నేతలు సీతారామారావు, బాలాజీ పాల్గొన్నారు.
లెక్కలు చెప్పాలి
ఆలయ నిర్మాణం జరిగి ఆరు సంవత్సరాలైంది. ప్రతి ఏడాది సమావేశాలు జరగాలి. జమ, ఖర్చులు, మిగులును సభ్యులకు తెలపాలి. అవీ ఏమీ జరుగలేదు. ఆలయ నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసినప్పుడు లెక్కలు అడిగితే ఇవ్వాలి. నేను సభ్యుడిని, దాతను వివరాలు నాకూ తెలపాలి.
– శేగు షణ్ముగరావు, గౌరవాధ్యక్షుడు, ప్రపంచ ఆర్య వైశ్యమహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment