నిండుకుండలా సోమశిల
● 5.51 లక్షల ఎకరాలకు
సాగునీటి విడుదలకు సన్నాహాలు
నెల్లూరు(దర్గామిట్ట): సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలను చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఏర్పడింది. కండలేరు జలాశయానికి పది వేలు.. ఉత్తర కాలువకు 700.. దక్షిణ కాలువకు 300, నారుమళ్ల కోసం పెన్నార్ డెల్టాకు 2150 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
మొదటి పంటకు ఢోకా లేనట్లే..
జలాశయానికి మరో 11 టీఎంసీల నీరొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుత లెక్కల మేరకు సోమశిల నుంచి 5.51 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే యోచనలో అధికారులు ఉన్నారని సమాచారం. జలాశయం నుంచి 55.1 టీఎంసీల నీరు అవసరమయ్యేలా అధికారులు అంచనాలు వేస్తున్నారు.
ఐఏబీ సమావేశం నేడు
కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఐఏబీ సమావేశాన్ని కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 3.30 నుంచి నిర్వహించనున్నామని ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్ తెలిపారు. 2024 – 25 ఖరీఫ్ సాగుకు గానూ సోమశిల, కండలేరు జలాశయాల నుంచి సాగునీటి విడుదల తదితర విషయాలపై సమావేశంలో చర్చించనున్నామని వివరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment