అభివృద్ధి పనులు వేగవంతం
● కలెక్టర్ ఆనంద్
వింజమూరు (ఉదయగిరి): జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా రూ.80 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, జలదంకి మండలాల్లో గురువారం పర్యటించిన ఆయన ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం వింజమూరు మండలం నందిగుంటలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సిమెంట్ రోడ్లు, మినీ గోకులాల పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. జిల్లాకు 1300 మినీ గోకులాలను మంజూరు చేయగా, ఇప్పటికే వంద మేర పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని 500 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించేందుకు నిధులను మంజూరు చేసి.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్, పట్టణాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ల ద్వారా పనులను చేపట్టామని వెల్లడించారు. నెల్లో వీటిని పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఉపాధిపై ప్రత్యేక దృష్టి
జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని, దీని ద్వారా జిల్లాలో ఇప్పటికే 2800కుపైగా పనుల మంజూరుకు ఉత్తర్వులను జారీ చేశామని చెప్పారు. మరికొన్ని పనులకు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులొచ్చాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని సైతం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మెట్ట ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని కోరారు. కూలీల సంఖ్య ఎంత పెరిగితే ఆ మేరకు మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మంజూరవుతాయన్నారు. నందిగుంటలో సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, డ్వామా పీడీ గంగాభవానీ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్‌కుమార్, వింజమూరు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ సయ్యద్ హమీద్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment