● పట్టుబడిన ముఠా
● ప్రేమజంట, నిందితులు నెల్లూరు వాసులు
బనశంకరి (బెంగళూరు): ప్రియుడ్ని అపహరించి దోపిడీ చేయాలని భావించిన ఓ యువతి చివరికి కటకటాల పాలైంది. బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన శివ, మోనిక మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెల్లూరులో మెడికల్ షాపును నిర్వహిస్తున్న శివ వద్ద బాగా డబ్బు, బంగారం ఉందని భావించిన మోనిక ఆయన్ను కిడ్నాప్ చేసి భారీగా వసూలు చేయాలని తనకు తెలిసిన వారితో కుట్ర పన్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం శివకు ఫోన్ చేసి, మిమ్మల్ని చూడాలని ఉంది, బంగారు ఆభరణాలు ధరించి ఇన్నోవాలో రావాలని సూచించారు. ఆమె మాటలను నమ్మిన శివ 60 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇన్నోవాలో పుట్టపర్తి జిల్లా హిందూపురం వద్ద గల పెనుకొండకు వచ్చారు. అక్కడ మోనిక అనుచరులు శివను కారులో అపహరించి బంగారు ఆభరణాలను దోచుకొని పావగడకు తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించారు. రూ.పది లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. శివ తన స్నేహితులతో మాట్లాడి తన బ్యాంక్ ఖాతాలోకి రూ.ఐదు లక్షలను జమ చేయించారు.
ఏటీఎం కార్డు తెప్పించి..
డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు లేదు. దీంతో నెల్లూరులోని ఇంటి నుంచి బెంగళూరు మెజెస్టిక్ చిరునామాకు కొరియర్ చేయించుకున్నారు. బెంగళూరులోని కోరమంగళలో నగదు డ్రా చేయడానికి శనివారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో కిడ్నాపర్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. గస్తీలో ఉన్న ఎస్సై మాదేశ్ అనుమానంతో వారిని విచారించగా కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు మోనిక, హరీశ్, హరికృష్ణ, నరేశ్, రాజ్‌కుమార్, నరసింహ, అంజనీల్‌ను అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లూ నెల్లూరుకు చెందినవారని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. నిందితుల్లో ఇద్దరిపై ఐదుకుపైగా కేసులున్నాయని చెప్పారు. దోపిడీకి సూత్రధారి మోనిక అని తెలుసుకొని శివ షాక్‌కు గురయ్యారు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment