స్టాఫ్ నర్సే ఇక్కడ డాక్టర్
నెల్లూరు(అర్బన్): జిల్లాలో 52 పీహెచ్‌సీలున్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు, నర్సులు, సిబ్బంది మొత్తం 12 మంది ఉన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు నెల్లూరులో 20, కందుకూరులో 2, కావలిలో 4, ఆత్మకూరులో ఒకటి, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి ఉన్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఒక డాక్టర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక డేటాఎంట్రీ ఆపరేటర్, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక స్వీపర్ కమ్ వాచ్‌మెన్, మరొక కోఆర్డినేటర్ కలిపి 8 మంది
ఉంటారు.
అర్బన్ హెల్త్ సెంటర్లలో మంగళవారం పరిశీలన చేయగా నెల్లూరు జేవీఆర్ కాలనీలో షుగర్ పరీక్ష చేయించుకోవాలని ఒక పెద్దామెను ఆమె కుమారుడు బైక్ మీద 8.30 గంటలకు తీసుకుని వచ్చాడు. అప్పటికి గేటు తాళాలు తీయలేదు. 9.05 వరకు వేచి చూడసాగారు. అప్పుడు తాళాలు తీశారు. సాధారణంగా స్వీపర్ ముందుగా వచ్చి 8.30 గంటలకు తాళాలు తీసి గదులు శుభ్రపరచాలి. అలా జరగలేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అర్బన్ హెల్త్ సెంటర్‌లో విధులు నిర్వర్తించాలి.
● వెంగళరావు నగర్‌లోని యుపీహెచ్‌సీని పరిశీలించగా 8.50 గంటలకు ఫార్మసిస్ట్ వచ్చారు. అంతకు ముందుగానే స్వీపర్ వచ్చి గదులు శుభ్రం చేస్తోంది. డాక్టరమ్మ 9.25 గంటలకు వచ్చారు. వైఎస్సార్‌నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించగా డాక్టర్ 10 గంటలు దాటాక వచ్చారు. గాంధీనగర్‌లో ఉన్న చంద్రమౌళినగర్ పీహెచ్‌సీలో కూడా డాక్టర్ 10 గంటల తర్వాతనే వచ్చారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్లందరూ కాంట్రాక్టు మీద పనిచేస్తున్న వారు కావడంతో వారు రోగుల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. జేవీఆర్ కాలనీలో రోజులో కేవలం 30 మంది రోగులు మాత్రమే వచ్చారు.
మందులు, రక్తపరీక్షల పరిస్థితి
అంతంత మాత్రమే
పట్టణ ఆరోగ్య కేంద్రంలో షుగర్‌కు సంబంధించిన ఇన్సులిన్ హ్యూమన్ మిక్సార్డ్ 30/70 ఇంజక్షన్ లేదు. అంబ్రాక్షల్ లాంటి దగ్గు మందులు లేవు. కొన్ని చోట్ల కామన్‌గా అవసరమయ్యే సిట్రిజిన్ మాత్రలు లేవు. సీజనల్‌గా వచ్చే జ్వరంలో సైతం రక్తకణాలు తగ్గిపోతున్నాయి. రక్తం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇందుకు సీబీపీ రక్త పరీక్ష అవసరం. రియేజంట్స్ అయిపోయాయని సీబీపీ పరీక్ష చేయలేదు. స్టూల్ పరీక్ష చేయడం లేదు. కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో గగ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండేందుకు, యాంటి బయాటిక్స్ పెట్టినప్పుడు సపోర్టుగా వాడే పాంటాప్రజోల్ టాబ్లెట్స్ కూడా లేవు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కూటమి ప్రభుత్వం సకాలంలో మందులు సరఫరా చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవే పరిస్థితులు జిల్లాలోని 28 అర్బన్‌హెల్త్ సెంటర్లలో ఉన్నాయి.
సోమశిల: అనంతసాగరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో వాళ్లు చేసే పనిని ఓ స్టాఫ్ నర్సు నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం పీహెచ్‌సీకి చెందిన ఇద్దరు డాక్టర్లు శ్రీకాంత్‌రెడ్డి, శ్రావణిలు హాస్పటల్‌కు వచ్చి హాజరు వేసుకుని డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి పింఛన్ వెరిఫికేషన్‌కు సంబంధించి వేరే మండలానికి డ్యూటీ వేయడంతో అక్కడకు వెళ్లారు. ఇంకో డాక్టర్ శ్రావణి 104 వాహనం డ్యూటీపై వెళ్లడంతో ఆసుపత్రిలో చివరకు స్టాఫ్ నర్సు దిక్కయింది. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు స్టాఫ్ నర్సు వైద్యుసేవలు అందించారు. డాక్టర్లు లేరని తెలిసి కొందరు రోగులు నిరాశగా వెనుదిరిగారు.
మందులుండేలా చర్యలు చేపట్టాం
జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ పీహెచ్‌సీలలో దాదాపు అన్ని రకాల మందులున్నాయి. అయితే ఒకటి అరా తగ్గితే వాటి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. రోగులకు మందుల కొరత రాకుండా ఉండేందుకు అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు చేపట్టాం
– డాక్టర్ వి.సుజాత, జిల్లా వైద్య,
ఆరోగ్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment