వైద్య సేవలపై ఆరా
రొద్దం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మంజువాణి శనివారం రొద్దం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై డాక్టర్ భాగ్యలక్ష్మితో ఆరాతీశారు. ఐఎల్‌ఆర్ వ్యాక్సిన్లు పరిశీలించారు. అక్కడే ఉన్న రోగులతో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని హెచ్‌ఎం గిరీష్‌స్వామికి సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల వైద్య పరీక్షలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ గిరినాథ్‌రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ
పుట్టపర్తి టౌన్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినిరీ, మెయిన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సాంఘిక సంక్షేమ సాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ సాధికారిత జిల్లా అధికారి నిర్మాలాజ్యోతి తెలిపారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పది, ఇంటర్ డిగ్రీ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రం, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు దరఖాస్తుకు జత చేసి జిల్లా సాంఘిక సాధికారిత కార్యాలయంలో నవంబర్ 24లోపు అందజేయాలని కోరారు. వార్షికాదాయం రూ. లక్షలోపు ఉండాలన్నారు. నవంబర్ 27న స్క్రీనింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా బీసీలకు 66, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 93921 41545 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
అప్పు తెచ్చిన తంటా
● తోపులాటలో వేడినీరు పడి చిన్నారికి తీవ్రగాయాలు
పరిగి: అప్పు కోసం జరిగిన తోపులాటలో ప్రమాదవశాత్తూ వేడినీరు పడి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఎస్‌ఐ రంగడు యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని బిందూనగర్‌లో శ్రీకన్య, సుబ్రహ్మణ్యం దంపతులు హోటల్ నిర్వహిస్తున్నారు. వీరు సాయి అనే వ్యక్తి వద్ద బియ్యం కొనుగోలు చేశారు. చాలా రోజులైనా బియ్యం డబ్బు చెల్లించకపోవడంతో సాయి శనివారం ఉదయం హోటల్ వద్దకు వచ్చాడు. అతడికి హోటల్ నిర్వాహకులకు మధ్య మాటామాటా పెరిగి తోసుకున్నారు. ఈ క్రమంలో అన్నం కోసం పాత్రలో పెట్టిన ఎసరు (వేడినీరు) అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యం నాలుగేళ్ల కూతురు ప్రణవిపై ఎగిరి పడడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బెంగళూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment