ఊరంతా నీరే!
పుట్టపర్తి అర్బన్: మండలంలోని సాతార్లపల్లి గ్రామంలో దాదాపు 30 రోజులుగా మరువ నీరు ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి ఉపరితలంలో గోబరకుంట చెరువు ఉంది. దానికి పైభాగంలో ఉన్న కొండల నుంచి నీళ్లు సమృద్ధిగా వస్తుండడంతో రోజూ మరువ పారుతోంది. ఈ మరువ నీళ్లన్నీ గ్రామంలోకి చేరుకుంటున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏటా నాలుగైదు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వివరిస్తున్నారు. ఫలితంగా గ్రామంలోని రెండు వీధులు పూర్తిగా పాచిపట్టి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. దీనికి తోడు మరుగుదొడ్ల గుంతలు, తాగునీటి సంప్‌లు పూర్తిగా మురుగు నీటితో నిండుతుంటాయి. గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమస్య మొరపెట్టుకున్నా నేటికీ పరిష్కారం దక్కలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండల మధ్య గ్రామం
పుట్టపర్తి మండల కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పూర్తి కొండల మధ్య సాతార్లపల్లిలో దాదాపు 180 కుటుంబాలు, 600కు పైగా జనాభా ఉంది. గ్రామంలోకి తరచూ అడవి జంతువులు వస్తూ పోతుంటాయి. గత ప్రభుత్వంలో తారు రోడ్డు వేయడంతో మండల, జిల్లా కేంద్రానికి రాకపోకలు పెరిగాయి. అయినా గ్రామానికి ఆటోలు, బస్సులు వెళ్లవు. ద్విచక్ర వాహనాలే గతి. ఇక వర్షాకాలం మొత్తం ఆరు నెలల పాటు ఊట నీటితో ఇబ్బంది పడుతుంటారు. ఎటు చూసిన మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. దీనిపై సచివాలయ కార్యదర్శి ఓంప్రసాద్, ఉపాధి ఏపీఓ మధుసూదన్‌రెడ్డి తదితర అధికారులను వివరణ కోరగా... సమస్యకు పరిష్కారం తమ శాఖల పరిధిలో లేదన్నారు. ఒకవేళ పనులు చేపట్టినా ఇందుకు తగినన్ని నిధులు మంజూరు కావన్నారు.
ఇబ్బందుల్లో గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment