ప్రయాణికుడికి సొత్తు అప్పగింత
పుట్టపర్తి టౌన్: బస్సులో మరిచిపోయిన బ్యాగ్, అందులోని 40 గ్రాముల బంగారు నగలు, ఇతర వస్తువులను సంబంధిత ప్రయాణికుడికి డ్రైవర్లు ఎస్‌వీ నారాయణ, డీసీ శేఖర్ అందజేసి, తమ నిజాయితీని నిరూపించుకున్నారు. వివరాలు... ఈ నెల 18న రాత్రి నెల్లూరు నుంచి పుట్టపర్తికి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో నెల్లూరు జిల్లా వాకాడ మండలం కొండూరుపాలెం గ్రామానికి చెందిన సోమయ్య ప్రయాణిస్తూ తన స్టేజ్ రాగానే రెండు బ్యాగ్‌లు మరిచి దిగిపోయాడు. 19వ తేదీ ఉదయం పుట్టపర్తి డిపోకు చేరుకున్న బస్సులో రెండు బ్యాగ్‌లను గుర్తించిన డ్రైవర్లు ఎస్‌వీ నారాయణ, డీసీ శేఖర్ వెంటనే వాటిని డిపో క్లర్క్‌కు అందజేశారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ ఇనాయతుల్లా బ్యాగ్ తెరిచి చూసి అందులోని బ్యాంక్ పాస్‌బుక్కులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడితో మాట్లాడారు. బుధవారం ఉదయం పుట్టపర్తి డిపోకు చేరుకున్న సోమయ్య తన ఆధారాలను చూపి బ్యాగ్‌లతో పాటు సొత్తును స్వాధీనం చేసుకున్నాడు. నిజాయితీ చాటుకున్న డ్రైవర్లు ఎస్‌వీ నారాయణ, డీసీ శేఖర్‌ను డీఎం ఇనాయతుల్లా, యూనియన్ నాయకులు, సిబ్బంది అభినందించారు.
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
గుత్తి: రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుత్తి ఆర్‌ఎస్‌లోని పత్తికొండ మార్గంలోని ఆర్‌ఓబీ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప, కానిస్టేబుల్ వాసు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప మాట్లాడుతూ... మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదని, ఆచూకీ పసిగట్టిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
అప్పుల బాధతో
చేనేత కార్మికుడి ఆత్మహత్య
పరిగి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన ఆదినారాయణ(44)కు భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మగ్గం వార్పు పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరి కుమార్తెల పెళ్లిలకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. అప్పులకు వడ్డీల భారం పెరిగి తీర్చలేని స్థాయికి చేరుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆదినారాయణ... మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె ఇంటి నుంచి బుధవారం ఉదయం తిరిగి వచ్చిన ఈశ్వరమ్మ... ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భర్తను చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment