వృద్ధురాలిని మోసగించి బంగారం అపహరణ
యాడికి: ఓ వృద్ధురాలిని మోసగించి ఆమె మెడలోని బంగారం గొలుసును దుండగుడు అపహరించుకెళ్లిన యాడికి మండలం చందన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. చందన గ్రామంలో ఈ నెల 14, 15 తేదీల్లో చౌడేశ్వరీ జ్యోతుల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గ్రామంలోని చాలా మంది ఇళ్లను సుందరంగా ముస్తాబు చేసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం తపాలా కార్యాలయం సమీపంలో ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల వయసున్న నారాయణమ్మను ఓ ఆగంతకుడు కలసి తాను బంగారు, వెండి గొలుసులకు మెరుగు పెడతానని చెప్పాడు. గ్రామంలో చాలా మంది తమ వద్ద ఉన్న పాత నగలకు మెరుగు పట్టించారని నమ్మబలికాడు. దీంతో నారాయణమ్మ తన మెడలోని 2 తులాల బంగారు గొలుసు తీసి మెరుగు పట్టాలని దుండగుడికి ఇచ్చింది. ఆమె కంటి ముందే ఓ గిన్నెలోకి గొలుసు వేసి పసుపు రంగు ద్రావకం కలిపాడు. అనంతరం గొలుసు బయటకు తీసి బ్రష్ చేసి, కడిగిన తర్వాత ఆమె దృష్టి ఏమారుస్తూ ఓ గిన్నెలోకి నకిలీ బంగారం గొలుసు వేసి ఓ గంట ఆగిన తర్వాత తీయాలని సూచించి, తన ఫీజు రూ.100 వసూలు చేసుకుని వెళ్లిపోయాడు. గంట తర్వాత ఇరుగు పొరుగు వారితో తాను బంగారు గొలుసుకు మెరుగు పెట్టించానని, బాగుందో లేదో చెప్పాలంటూ నారాయణమ్మ చూపించింది. చూసిన వారంతా అది గిల్టు నగ అని తెలపడంతో వృద్ధురాతి వేదనకు అంతులేకుండా పోయింద. విషయం తెలుసుకున్న సచివాలయ మహిళా పోలీసు జీవిత అక్కడకు చేరుకుని ఆరా తీశారు. సాయంత్రం నారాయణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment