పెండింగ్ పనులను పూర్తి చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్ లో జాతీయ రహదారులు, రైల్వేలైన్లు, ఆర్‌ఆండ్‌బీ , అటవీశాఖ , చిన్న నీటి పారుదల, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించిన సమావేశాలకు కచ్చితంగా జాతీయ రహదారుల పీడీ హాజరు కావాలని ఆదేశించారు. లైన్ షిఫ్టింగ్, పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. చిలమత్తూరు, గోరంట్ల మండలంలోని చాగలేరు, బుక్కపట్నం, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి మలకవేమల ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనుల్లో నెలకొన్న సమస్యలను ఆయా మండలాల తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లింపులు జరగాలన్నారు. జాతీయ రహదారుల పీడీ అశోక్‌రెడ్డి, డీఈ గిడ్డయ్య, నేషనల్ హైవే మేనేజర్ ముత్యాలరావు, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
రుణాలు విరివిగా ఇవ్వాలి
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు రుణ సహాయం అందించి అన్ని విధాలా ప్రోత్సహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామికవాడల్లో ఇప్పటికే ప్లాట్లు కేటాయించిన వారితో పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 3,994 దరఖాస్తులు అందగా 3,883 ప్రతిపాదనలు ఆమోదించారు. 51 దరఖాస్తులు తిరస్కరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహానీ, ఎల్‌డీఎం రమణకుమార్, డీపీఓ సుమత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment