ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి ఘటన
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
పెనుకొండరూరల్: కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి టోకెన్ల పంపణీలో ఇంత వరకూ ఎప్పుడూ భక్తులు చనిపోలేదన్నారు. ఇప్పుడు ఏకంగా ఆరుగురు చనిపోవడం, 40 మంది వరకూ గాయపడటం, కొందరి పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెంకన్న దర్శనం టోకెన్లు ఇస్తామంటే లక్షల్లో భక్తులు వస్తారని ప్రభుత్వం ముందే ఎందుకు ఊహించలేదో చెప్పాలన్నారు. 6, 7 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులందరినీ తరలించారని, అందుకే తిరుమలకు వెళ్లే భక్తులకు భద్రత ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నెట్టడం సరికాదన్నారు. సనాతన ధర్మం పాటించే ఉప ముఖ్యమంత్రి పవన్‌కు భక్తుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు.హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతిలో భక్తులు మృతి చెందడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు.
లింగ నిర్ధారణ
నిషేధ చట్టంపై అవగాహన
పుట్టపర్తి అర్బన్: లింగ నిర్ధారణ నిషేధ చట్టానికి (పీసీపీఎన్‌డీటీ యాక్ట్–1994) ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, డివిజన్‌స్థాయి అడ్వైజరీ కమిటీలపై గురువారం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల సీనియర్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అడ్వైజరీ కమిటీ సభ్యుల అధికారాలు, పరిమితులను వివరించారు. చట్టం కింద వచ్చే ఫిర్యాదులను వెంటనే నిష్పక్షపాతంగా సాధ్యమయినంత వరకూ పోలీసుల ప్రమేయం లేకుండా పరిష్కరించాలన్నారు. సమీక్షలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు మంజువాణి, సెల్వియా సాల్మన్, నివేదిత, డెమో బాబా ఫకృద్దీన్, ఎస్‌ఓ కళాధర్, తదితరులు పాల్గొన్నారు.
కోడి పందాలు
నిర్వహిస్తే చర్యలు
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధకశాఖ అధికారులతో కలిసి ‘కోడి పందాలు నిర్వహించడం –పాల్గొనడం నేరం’ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కోడిపందాలు నిర్వహించినా అందులో పాల్గొన్న శిక్ష తప్పదన్నారు.
నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
పుట్టపర్తి: జిల్లాలోని అన్ని పాఠశాలలకు శుక్రవారం నుంచి 19వ తేదీ వరకూ 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. ఈ నెల 20వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు.
రేపు వడ్డే ఓబన్న
జయంతి వేడుకలు
ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈనెల 11న కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు వడ్డే ఓబన్న చిత్రపటం వద్ద నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment