నువ్వు నా కాళ్ల దగ్గరకు రావాల్సిందే...
గోరంట్ల: ‘నిన్ను ఎక్కడా మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వను. నువ్వు నా కాళ్ల దగ్గరకు రావాల్సిందే’. అంటూ వ్యవసాయాధికారి మునికృష్ణ తనను వేధించారంటూ సచివాలయ సెరికల్చర్ సహాయకురాలు దీప విచారణ అధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకెళితే... గోరంట్ల మండల పరిధిలోని వడిగేపల్లి గ్రామ సచివాలయంలో సెరికల్చర్ సహాయకురాలుగా దీప పనిచేస్తున్నారు. అయితే ఆరు నెలలుగా మండల వ్యవసాయాధికారి మునికృష్ణ తనను లైంగికంగా వేధించడంతో పాటు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు. దీంతో హిందూపురం పట్టు పరిశ్రమశాఖ సహాయ సంచాలకులు సురేష్‌కుమార్, పెనుకొండ డివిజినల్ వ్యవసాయ అధికారి స్వయంప్రభ గురువారం స్థానిక పట్టు పరిశ్రమశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో విచారణ చేపట్టారు. బాధితురాలు దీపతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా విచారించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అలాగే ఏఓ మునికృష్ణ వివరణ కూడా తీసుకున్నారు.
నా ప్రాణానికి ముప్పు ఉంది..
బాధిత ఉద్యోగి దీప తన గోడును విచారణ అధికారుల ముందు చెప్పుకున్నారు. వడిగేపల్లిలోని రైతు సేవ కేంద్రంలో ఒంటరిగా విధులు నిర్వహించే సమయంలో ఏఓ మునికృష్ణ విజిట్ పేరుతో వచ్చి అసభ్యంగా మాట్లాడేవారన్నారు. గంటల తరబడి వేధింపులకు గురిచేసేవారని, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా నరకం అనుభవించానని వాపోయారు. చివరికి ఉద్యోగానికి కూడా రాజీనామా చేశానని వెల్లడించారు. అయితే తన తల్లి, పట్టు పరిశ్రమశాఖ ఉన్నతాధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనియన్ నాయకులు సపోర్టుతో రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పట్టు పరిశ్రమశాఖ ఉన్నతాధికారులు వడిగేపల్లి సచివాలయం నుంచి వేరే చోటికి డిప్యూటేషన్ చేశారన్నారు. అయితే తనపై కక్ష పెంచుకొన్న వ్యవసాయ అధికారి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయకపోగా... ‘నువ్వు నా కళ్ల దగ్గరకు రావాల్సిందే.. నిన్ను ఎక్కడా మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వను’ అంటూ బెదిరించారన్నారు. మునికృష్ణ వల్ల తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగినికి
ఏఓ వేధింపులు
కలెక్టర్ ఆదేశాలతో
అధికారుల విచారణ
అధికారుల ముందు
గోడు వెళ్లబోసుకున్న మహిళా ఉద్యోగి
దీపకు
అండగా
ఉద్యోగుల సంఘం
నాయకులు
బాధిత ఉద్యోగి దీపకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు అండగా నిలిచారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు అంజనరెడ్డి ఆధ్వర్యంలో సంఘం నాయకులు అక్కడికి చేరుకొని విచారణ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. సచివాలయ మహిళా ఉద్యోగులపై రోజురోజుకూ వేధింపులు అధికమయ్యాయన్నారు. వేధింపులకు చెక్ పెట్టేందుకు ఉన్నతాధికారులు కృషిచేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని అంజనరెడ్డి విచారణ అధికారులకు తెలిపారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని విచారణాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment