టెక్నాలజీ సాయంతో నేరాల నియంత్రణ
పుట్టపర్తి టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా నేరాల నియంత్రణకు గట్టిగా కృషి చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ద్వారక తిరుమలరావు తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటిపై ప్రత్యేక ఆడియోలు, వీడియోలు, విద్యాసంస్థల్లో సదస్సులు, ర్యాలీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాకూ ఒక సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక ప్రశాంతినిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ షిమోషీ, ఎస్పీ రత్నతో కలసి పోలీసు అధికారులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మారుద్దామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వంద ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగులో ఉందని, దాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాంగ్, ర్యాష్ డ్రైవింగ్ మానుకోవాలని, హెల్మెట్ తప్పక వాడాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉంటామన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడమంటే లైసెన్స్ లేని తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో సమానమని అభిప్రాయపడ్డారు. ఇటీవల జిల్లా పోలీస్ అఽధికారులు విడుదల చేసిన శాంతభద్రతలు, నేర నివేదిక –2024 ప్రకారం జిల్లాలో అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోందన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సంస్థ ఆదాయం పెంచండి
ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. ఖర్చులు తగ్గించుకుని, సంస్థ ఆదాయం పెంచాలని డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు సూచించారు. ఆయన పుట్టపర్తి ఆర్టీసీ బస్సు డిపోను తనిఖీ చేశారు. డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఉద్యోగులకు బకాయిలను ఈ నెలాఖరులోపు చెల్లిస్తామన్నారు.
ప్రతి జిల్లాకూ ఒక సైబర్ క్రైమ్ స్టేషన్
డీజీపీ ద్వారక తిరుమలరావు
Comments
Please login to add a commentAdd a comment