నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల
అరసవల్లి: శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 11 కేవీ ఫీడర్ల మరమ్మతు, నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లుగా ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు ప్రకటనలో తెలియజేశారు. ఈమేరకు కనుగులవానిపేట సబ్‌స్టేషన్ పరిఽధిలో కనుగులవానిపేట, కళ్లేపల్లి, ఇప్పిలి, చల్లపేట సబ్‌స్టేషన్ పరిధిలో చల్లపేట, శ్రీకూర్మం, ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలో ముద్దాడ, లోలుగు (పొందూరు) సబ్‌స్టేషన్ పరిధిలో లోలుగు, జి.సిగడాం సబ్‌స్టేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలు, రణస్థలం సబ్‌స్టేషన్ పరిధిలో రణస్థలం, నెలివాడ, లావేరు మండలం లావేటిపాలెం, శ్రీకా కుళం నగరం హడ్కోకాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.
బిర్సా ముండా జయంతి ఏర్పాట్ల పరిశీలన
మెళియాపుట్టి: మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల భవన సముదాయాల్లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతిని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఏకలవ్య పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను, టెక్కలి ఆర్‌డీఓ ఎం.కృష్ణమూర్తితో కలిసి పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో మాట్లాడుతూ స్టాల్స్‌ను అన్ని శాఖల నుంచి ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయనతో పాటు ఈఈ రమాదేవి, డీఈ సిమ్మన్న, ఏఈ శ్రీకాంత్, ఐటీడీఏ పీహెచ్‌ఓ గణేష్, ఎంపీడీఓ నరసింహ ప్రసాద్ పండా, తహసీల్దార్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి సేవలను http:jnana bhumi.apcfrr.in వెబ్ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.
నల్ల చట్టాలు రద్దు చేయాలని 26న ధర్నా
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలో రైతులు పాల్గొనాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు,కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం సీపీఎం కార్యాలయంలో తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడారు. ఆనాడు ఢిల్లీ నడిబొడ్డున పదమూడు నెలల కాలం పాటు జరిగిన రైతుల ఉద్యమాన్ని నీరుగార్చిన నరేంద్ర మోదీ.. అప్పట్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. దీన్ని నిరసిస్తూ 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనలో పెద్ద ఎత్తున రైతు కా ర్మిక అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోనారి మోహనరావు, చాపర వేణుగోపాల్, పేకల తేజేశ్వరరావు (సిఐటియు), అమ్మన్న నాయుడు,సురేష్,యుగంధర్ (ఎ ఐ వై ఎఫ్) పోలాకి ప్రసాద్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment