బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తెలి పారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘బాల్య్ వివాహ్ ముక్త్ భారత్‘ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్‌ఐసీ నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. బాల్య వివాహాలు ఎదుర్కోవడంలో వారి విజయాల గురించి మాట్లాడటానికి ఎంపిక చేసిన 9 మంది పిల్లల్లో ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట గ్రామానికి చెందిన బుచ్చ రమణమ్మతో మంత్రి వర్చువల్‌గా మాట్లాడారు.
అందరి సహకారం అవసరం
కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ బాల్య వివాహాల సమస్య అధిగమించడానికి అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శాంతిశ్రీ, పీఓ ఎం.మల్లేశ్వరరావు, పీఓ ఐఎల్ నాయుడు తదితరులు హాజరయ్యారు.
ఎదురించి నిలిచాను..
నేను బాల్య వివాహాన్ని ఎదురించి చదువుపై దృష్టి పెట్టాను. దాని ఫలితంగానే ఉద్యోగం చేసి కుటుంబానికి ఉపయోగపడుతున్నాను. నా తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాకు 14 ఏళ్ల వయసులోనే వివాహం చేశారు. కానీ సమగ్ర బాలల పరిరక్షణ విభాగం వారికి ఈ విషయం తెలిసి నా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. నా వివాహాన్ని రద్దు చేయించారు. నాకు చదువుపై మక్కువ ఉండేది. అందుకే బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. బాల్య వివాహాల నిర్మూలను నా వంతు సహాయం చేస్తాను.
– బుచ్చ రమణమ్మ, కుంచాల కూర్మయ్యపేట
Comments
Please login to add a commentAdd a comment