ఎన్నికా.. ఏకగ్రీవమా?
మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు వాసు మరోసారి కొనసాగకూడదు. ఈ సారి తప్పకుండా మార్చాల్సిందే. మన అనుకున్నోళ్లే అధ్యక్షుడిగా ఉండాలి. అది కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలి.
–జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంతంగా నడుస్తున్న టాక్.
మంచి చేస్తున్న వాసు మాత్రమే ఉండాలి. మరొకరికి అవకాశమిస్తే నష్టమే. గతంలో ఇద్దరు చేశారు. ఏం జరిగిందో చూశాం. మళ్లీ ఆ ఇబ్బందులు రాకూడదు. అవసరమైతే ఎన్నికలకై నా వెళ్తాం.
– మెజారిటీ మిల్లర్ల అభిప్రాయం
అవకాశమిస్తే చేస్తాను. ఇన్నాళ్లూ చేతనైనంత చేశాను. పదవి కోసం పాకులాడను. రాజకీయం చేయాలనుకోను. సభ్యులు తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకుంటాను.
– ప్రస్తుత అధ్యక్షుడు వాసు ఆలోచన
ఎన్నికకు వెళ్తే..
జిల్లాలో 330 మంది వరకు మిల్లర్లు ఉన్నారు. వాసును మార్చాలని మంత్రి పట్టుబడితే ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో మిల్లర్లు ఉన్నారు. ప్రస్తుత సమీకరణాలు ప్రకారం మెజారిటీ మిల్లర్లు వాసు వైపే ఉన్నారు. కోటబొమ్మాళి, నరసన్నపేటకు చెందిన కొంతమంది వ్యతిరేకంగా ఉన్నా వారంతా ప్రభావం చూపే పరిస్థితి లేదు. దీంతో మంత్రి పేరుతో ఎవరైనా బరిలో ఉన్నా గెలిచే అవకాశాలు తక్కువే. ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పంతానికి పోయి, స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా బెదిరింపులకు దిగితే చెప్పం లేం గాని.. ఆ పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎన్నికలు జరిగితే మాత్రం వాసుకే విజయావకాశాలు ఎక్కువ. దీంతో కూటమి నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఎన్నికలకు వెళ్లి ఓడిపోయి అప్రతిష్ట, వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని తర్జనభర్జన పడుతున్నారు. ఇదే సందర్భంలో వాసును మెజారిటీ మిల్లర్లు కోరుకుంటున్నప్పటికీ ఆ పదవిపై ఆయన కూడా అంత పట్టుదలతో ఉండటం లేదు. రాజకీయంగా పోటీ పడాలనో..ఏదో ఒకటి చేసి గెలవాలనో ప్రయత్నించడం లేదు. సభ్యులు అవకాశమిస్తే చేస్తాను.. లేకుంటే సభ్యుడిగా కొనసాగుతాననే అభిప్రాయంతోనే ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
జిల్లా మిల్లర్ల సంఘం కార్యవర్గం ఎన్నికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతి సారీ నాలుగ్గోడల మధ్య సభ్యుల ఏకాభిప్రాయంతో జరిగిపోయే ఎన్నికకు ఈ సారి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఇటీవల జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిపోయింది. మంత్రి అచ్చెన్నాయుడు ఆలోచన ఒకటైతే.. మిల్లర్ల అభిప్రాయం మరొకటి కావడంతో ఏకాభిప్రాయం కుదరలేదు.
మిల్లర్ల సంఘంలో రాజకీయ జోక్యం..
ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో కలిసిపోయే కార్యవర్గం మిల్లర్లది. వారి కార్యకలాపాలు, సంఘం శ్రేయస్సు దృష్ట్యా ధాన్యం సేకరణ సమయంలో సమష్టిగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో ముందుకు సాగుతుంటారు. అలాగని ఆయా పార్టీలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగరు. వారి సంఘం అవసరాల దృష్ట్యా వెళ్తుంటారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల మైండ్‌సెట్ మారింది. తటస్థ విధానం తమకొద్దు.. తమకు అనుకూలంగా ఉండే వారే కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అధికారుల పోస్టింగ్‌లు, సిబ్బంది బదిలీలు రాజకీయ కోణంలో జరిగాయి. తాజాగా మిల్లర్ల సంఘంలోనూ రాజకీయం ప్రవేశం ప్రవేశించింది. ముఖ్యంగా జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టి పడింది. తన మనసులో మాటను బహిరంగంగా చెప్పకుండా, అనుయాయులు, తోటి మిల్లర్ల ద్వారా తన ఆలోచనను తెలియజేశారు. మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా వాసు ఉండకూడదు. అనుకూలమైన వ్యక్తే ఆ పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు.
మంత్రికి కలిసి రాని పరిస్థితులు
మంత్రిగా తన మనసులో ఒకటున్నా.. తాను అనుకున్నదే జరగాలని భావిస్తున్నా పరిస్థితులు అంతగా అనుకూలంగా కన్పించడం లేదు. దీనికంతటికీ ప్రస్తుత అధ్యక్షుడు వాసుపై అత్యధిక మిల్లర్లకు ఉన్న నమ్మకమే కారణం. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తమకు కావల్సిన వారిని అధ్యక్షులుగా ఎంపిక చేసినా సంఘానికి మేలు జరగలేదు. బోయిన రమే ష్, తంగుడు జోగారావు తదితర వ్యక్తులు అధ్యక్షులుగా చేసిన కాలంలో న్యాయం జరగలేదన్న అసంతృప్తి మిల్లర్లలో ఉంది. అందుకే సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు వద్దని చెబుతున్నా మెజారిటీ మిల్లర్లపై వాసు ౖవైపే మొగ్గుచూపుతున్నారు. ఆ నమ్మకానికి వాసు పనితనమే కారణం. 2014–19మధ్య మిల్లర్ల ఖాతాలో జమ కావల్సిన రూ.16కోట్ల ధాన్యం రవాణా చార్జీలను న్యాయస్థానాన్ని ఆశ్రయించి సాధించుకోగలిగారు. అలాగే, మిలర్ల సంఘం కోసం శ్రీకాకుళంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించి, తమకొక అడ్రస్సు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకునిపోతే వాసు ఖాతాలో అనేక విజయాలు
ఉన్నాయి. అలాగే అధ్యక్షులుగా పనిచేసిన మరికొందరి సమయంలో పడిన ఇబ్బందులు మిల్లర్లు మరిచిపోలేకపోతున్నారు. దీంతో వాసే కావాలని మెజారిటీ మిల్లర్లు కోరుకుంటున్నారు. దీంతో ఏకగ్రీవంగా మిల్లర్ల సంఘం అధ్యక్ష ఎన్నికకు ఆస్కారం లేకుండాపోయింది. మంత్రి పంతానికి తగ్గట్టుగా లైన్ క్లియర్ కాలేదు.
మిల్లర్ల సంఘం ఎన్నికపై ప్రతిష్టంభన
ప్రస్తుత అధ్యక్షుడు వాసును మార్చాలని మంత్రి అచ్చెన్న పంతం!
వాసుపైనే మొగ్గు చూపుతున్న మెజారిటీ సభ్యులు
ఒత్తిడి చేస్తే ఎన్నికలకు వెళ్లాలని
చూస్తున్న పరిస్థితి
ఏకాభిప్రాయం కుదరక ఎన్నిక తాత్సారం
Comments
Please login to add a commentAdd a comment