రాష్ట్రంలో రాక్షస పాలన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి నిరంతరం దాడులు, కక్షసాధింపులు, పగలు ప్రతీకారాలు తీర్చుకునే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. అరాచక పాలన సాగిస్తే ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మహాత్మా జ్వోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పొన్నాడ వంతెన వద్ద ఉన్న పూలే పార్కులో కృష్ణదాస్ మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. బీసీలకు పెద్దపీట వేసి పూలే వంటి మహనీయుల ఆశయ సాధనకు నిరంతరం పరితపించిన నాయకుడు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో దాడులు చేయడం సరికాదని, దాడికి ప్రతిదాడి తప్పదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తే కేసులు బనాయించడం దారుణమన్నారు. ప్రజల గొంతునొక్కేయాలని చూస్తే ఎవ్వరు సహించరని, ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చి తీరాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి జనరంజక పాలన అందించామని గుర్తు చేశారు. కూటమి సర్కారు వాటన్నింటిని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు, కళింగవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, సాధు వైకుంఠరావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు చింతాడ వరుణ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎన్ని ధనుంజయరావు, ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి, అంబటి శ్రీనివాసరావు, ఎం.వి.స్వరూప్, డాక్టర్ శ్రీనివాస పట్నాయక్, గద్దిబోయిన కృష్ణయాదవ్, టి.కామేశ్వరి, ముంజేటి కృష్ణ, ఎం.ఏ.రఫీ, సిజు, ఎం.ఏ.బేగ్, సీహెచ్ భాస్కరరావు, గొండు కృష్ణ, అంధవరపు రమేష్, డి.పి.దేవ్, కర్నేన హరి, వానపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దాడులకు ప్రతిదాడి తప్పదు
మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment