నేటి నుంచి పరిశ్రమల సర్వే
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఈ నెల 29 నుంచి సర్వే ప్రారంభమవుతుందని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు జె.ఉమామహేశ్వరరావు గురువారం తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనికోసం ఎంఎస్‌ఎంఈ సర్వే, సపోర్ట్ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సర్వే నిర్వహిస్తారని తెలిపారు. సర్వే ఫలితాల ఆధారంగా వివిధ రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని, యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
ఎస్పీకి హోంగార్డుల కృతజ్ఞతలు
శ్రీకాకుళం క్రైమ్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సరుబుజ్జిలి హోంగార్డు రేవతికి మెరుగైన చికిత్స అందించడంలో ఔదార్యం కనబరిచిన ఎస్పీ మహేశ్వరరెడ్డికి మహిళా హోంగార్డు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పూలకుండీ బహూకరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శేషాద్రినాయుడు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు కీలకం
ఎచ్చెర్ల క్యాంపస్: ఇంజినీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ కె.ఆర్.రజిని అన్నారు. వర్సిటీ సెమినార్ హాలులో గురువారం వర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ, సీఎస్‌ఈ ఇంజినీరింగ్ విద్యార్థులకు నెల రోజులు పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టార్టప్‌లకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు. మారుతున్న సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. ఉన్నతి ఫౌండేషన్ ఛేంజ్‌మేకర్ బి.రంజిత్ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్లభాష నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ, జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment