No Headline
● ఐదు నెలలుగా ఆయాలు, నైట్ వాచ్‌మెన్లకు అందని వేతనాలు
● ఎలా బతకాలని ప్రశ్నిస్తున్న చిరుద్యోగులు
● జిల్లా వ్యాప్తంగా 2576 మంది ఆయాలు, 296 మంది నైట్ వాచ్‌మెన్లు
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చిరుద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారింది. కొందరు ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందకపో గా మరి కొందరికి ఉద్యోగాలే ఉండటం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా చిరుద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, నైట్‌వాచ్‌మెన్లు ఆకలితో అలమటిస్తున్నారు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో అప్పులపాలవుతున్నారు. మరో వైపు పెరిగిన ని త్యావసర సరుకులు, కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఐదు నెలలుగా ప్రభుత్వం వీరికి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఐదు నెలలుగా వేతనాలు రాక పోతే ఎలా జీవించాలని ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచీ వేతనాలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ఒక్కొక్కరికి రూ.30వేలు బకాయిలు
స్కూల్స్‌లో టాయిలెట్లు, వాష్ బేసిన్లు పరిశుభ్రంగా లేకుంటే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని భావించి గత ప్రభుత్వం స్కూళ్లలో ఆయాలను నియమించింది. అలాగే ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్లను కూడా కాపలా కోసం పెట్టారు. వీరిని ఒక్కొక్కరికి నెలకు రూ.6వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఆ మేరకు గత ప్రభుత్వ కాలంలో సక్రమంగా వేతనాలు వచ్చేవి. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మారింది. ఇప్పటి వరకూ ఆయాలకు, నైట్ వాచ్‌మెన్లకు వేతనాలు రాలేదు. దీంతో వీరు ఆందోళన చెందుతున్నారు. జూన్ నుంచి అక్టోబరు వరకూ వీరికి ఒక్కొక్కరికీ రూ.30 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వేతనాలు రాకపోయినా ఆయాలు, నైట్‌వాచ్‌మెన్లు వారి విధులను సక్రమంగా నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రధానంగా స్కూల్ పరిసరాలు క్లీన్‌గా ఉంచుతున్నారు. వీరికి వేతనాలు చెల్లించక పోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయాలు, నైట్‌వాచ్‌మెన్లు కోరుతున్నారు.
రూ. 1.72 కోట్లు బకాయిలు..
జిల్లాలో 3046 స్కూల్స్ ఉండగా 2576 మంది ఆయాలు, 296 మంది నైట్‌వాచ్‌మెన్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ ఐదు నెలల వేతనం రూ. 30 వేలు చొప్పున రూ.1.72 కోట్లు ప్రభుత్వం బకాయి పడి ఉంది. ఈ మేరకు బడ్జెట్ రాకపోవడంతో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ కింద పనిచేస్తున్న ఆయాలు, నైట్ వాచ్‌మెన్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వీరు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment