శానిటైజర్ తాగి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కోదాడ: అస్సాం రాష్ట్రం నుంచి వచ్చి కోదాడలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థిని.. హాజరు శాతం తక్కువగా ఉన్నందుకు అధిక ఫీజు చెల్లించాలని కాలేజీ నిర్వాహకులు వేధిస్తున్నారని బుధవారం రాత్రి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. కోదాడ పట్టణంలోని భవానీనగర్‌లో గల స్నేహా నర్సింగ్ కళాశాలలో అస్సాం రాష్ట్రానికి చెందిన నర్గిస్ పర్విన్ నర్సింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాలలకు సక్రమంగా హాజరుకానందున ఫీజు అదనంగా చెల్లించాలని కళాశాల నిర్వాహకులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం కళాశాల హాస్టల్‌లో ఆమె శానిటైజర్ తాగింది. ఇది గమనించిన హాస్టల్ వార్డెన్ సదరు విద్యార్థినిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. గురువారం ఆమె బంధువులు వచ్చి స్నేహా నర్సింగ్ కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment