డేటా ఎంట్రీ త్వరగా పూర్తిచేయాలి
ఆత్మకూర్ (ఎస్): సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. గురువారం ఆత్మకూరు (ఎస్) తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేయాలన్నారు. అంతకుముందు పాత సూర్యాపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఇన్‌చార్జి తహసీల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఆర్‌ఐ స్వప్న, ఏపీఎం మంజుల తదితరులు ఉన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నడిగూడెం: ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) భానునాయక్ కోరారు. నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులకు చేపట్టిన ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. వృత్తి విద్య కోర్సుల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్స్‌పాల్ డి.విజయ నాయక్, అధ్యాపకులు ఉన్నారు.
ఆర్టీసీ ఆర్‌ఎం బదిలీ
ఫ నూతన ఆర్‌ఎంగా జానిరెడ్డి
నల్లగొండ రూరల్: ఆర్టీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్‌ఎం రాజశేఖర్ సికింద్రాబాద్‌కు బదిలీ చేస్తూ గురువారం ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌లో పనిచేస్తున్న జానిరెడ్డిని నల్లగొండ ఆర్‌ఎంగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీక్షా దివస్‌ను
విజయవంతం చేయాలి
సూర్యాపేట టౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ చౌరస్తా వద్ద శుక్రవారం తలపెట్టిన దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. గురువారం దీక్షా దివస్ నిర్వహించే ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే మరువలేని రోజు నవంబర్ 29 అని పేర్కొన్నారు. ఈ దీక్షా దివస్‌లో నాయకులు, యువత, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైవీ.ప్రభాకర్‌రెడ్డి, ఆకుల లవకుశ, ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణరెడ్డి, జీడి భిక్షం పాల్గొన్నారు.
వ్యాస రచన విజేతలకు బహుమతులు
సూర్యాపేట టౌన్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో గురువారం పునరుద్ధరింపబడిన వనరులు అనే అంశంపై జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కోదాడ తేజ విద్యాలయానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ.క్షత్రజ్ఞ రత్నం ప్రథమ స్థానం, జాజిరెడ్డిగూడెం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎ.గ్రేస్ ద్వితీయ, సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.2కు చెందిన పదో తరగతి విద్యార్థిని పి.శ్రీజ తృతీయ స్థానం సాధించారు. వీరికి డీఈఓ కె.అశోక్ బహుమతులు అందజేశారు. వీరు డిసెంబర్ 3న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజు, సెక్టోరియల్ అధికారి డీఎస్ జనార్దన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment