సీపీఎం మహాసభలకు సర్వంసిద్ధం
ఫ సూర్యాపేటలో నేటినుంచి ప్రారంభం
ఫ గాంధీపార్క్‌లో బహిరంగ సభ
ఫ హాజరుకానున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఈనెల 29, 30, డిసెంబర్ 1వ తేదీల్లో సూర్యాపేటలో జరిగే సీపీఎం జిల్లా మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం గాంధీ పార్క్‌లో జరిగే బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలి.
– మల్లు నాగార్జునరెడ్డి,
సీపీఎ జిల్లా కార్యదర్శి
భానుపురి (సూర్యాపేట): సీపీఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ మహాసభల కోసం ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన వీధులన్నీ వాల్‌రైటింగ్, పార్టీ జెండాలు, ఎర్రని తోరణాలతో ముస్తాబు చేశారు. దీంతో ఏ వీధికి వెళ్లినా ఎర్రని జెండాలే కనిపిస్తున్నాయి. ఈ సభలకు జిల్లాలో ఎంపిక చేసిన 500 మంది ప్రతినిధులతోపాటు ఆహ్వానితులు, సీనియర్ సిటిజన్స్‌లు హాజరు కానున్నారు.
నేడు బహిరంగ సభ
సీపీఎం జిల్లా మహాసభలు శుక్రవారం నుంచి ఆదివారం (డిసెంబర్ 1వ తేదీ) వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని గాంధీపార్క్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు రాష్ట్ర నేతలు హాజరు కానుండడంతో భారీగా జనాన్ని తరలిరావాలని పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు కుడకుడ సమీపంలోని భాగ్యలక్ష్మీ మిల్లు నుంచి వెయ్యి మంది యువకులతో రెడ్‌షెట్ కవాత్ ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనలో 500 మంది కోలాటదళం, డప్పు కళాకారులతో పాటు విచిత్ర వేషధారణలు ఉంటాయి. ర్యాలీ అనంతరం గాంధీ పార్కులో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment