ఆక్రమణపై పట్టింపేదీ?
కోదాడలో వ్యవసాయ శాఖకు చెందిన 300 గజాల స్థలం అన్యాక్రాంతం
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న వ్యవసాయ శాఖ గోదాము స్థలం ఆక్రమణకు గురైన విషయాన్ని ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కార్యాలయం రైతు విశ్రాంతి గృహంలో కొనసాగుతోంది. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం వర్షం వస్తే కురుస్తోంది. కంప్యూటర్లు, ఫైళ్లు తడుస్తున్నాయి. స్థలాన్ని మాకు అప్పగించి కొత్త భవనం కడితే రైతులకు అందుబాటులో ఉంటుంది.
– యల్లయ్య, ఏడీఏ, కోదాడ
ఫ గజం విలువ రూ.లక్షకు పైమాటే..
ఫ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అధికారులు
ఫ రైతు విశ్రాంతి భవనంలో
కొనసాగుతున్న కార్యాలయం
కోదాడ: పట్టణ నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ శాఖ స్థలం ఆక్రమణకు గురవుతోంది. దీనిపై ఆశాఖ అధికారులు అనేక సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా 20 రోజుల క్రితం కోదాడకు వచ్చిన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోదాడ ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. కానీ అధికారుల్లో మాత్రం కదలిక రావడం లేదు. ఇదే అదునుగా ఈ స్థలంలో ఉన్న రేకుల గోదామును ఒకపక్క తొలగించి కొందరు శాశ్వతంగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 32 మంది సిబ్బందితో పనిచేస్తున్న కోదాడ వ్యవసాయ శాఖకు కార్యాలయం లేక మార్కెట్ యార్డులో ఉన్న రైతు విశ్రాంతి భవనంలో తమ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదికూడా శిథిలావస్థకు చేరింది. దీనిని కూల్చివేయాలని ఐదేళ్ల క్రితమే ఇంజనీర్లు రిపోర్టు ఇచ్చినా ఇంకా దానిలోనే కొనసాగిస్తున్నారు.
ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా..
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కోదాడ వ్యవసాయ శాఖకు పట్టణంలోని రంగా థియేటర్ సమీపంలో ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్కన 300 గజాల స్థలం ఉండేది. దానిలో విత్తనాలు, ఎరువులను నిల్వ చేసుకోవడానికి ఇనుప రేకులతో గోదాము నిర్మించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న రైతు విశ్రాంతి గృహంలోకి మార్చడంతో దానికి సమీపంలోనే ఉన్న గోదాములను కూడా వ్యవసాయ శాఖ వాడుకుంటోంది. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న వ్యవసాయ శాఖ గోదాము దాదాపు 40 ఏళ్లుగా ఖాళీగానే ఉంటోంది. దీనికి ముందు ఖాళీ స్థలంలో ఒక మెకానిక్ చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం అక్కడ శాశ్వత నిర్మాణాలు చేసుకున్నాడు. గోదాము రేకులను కూడా తొలగించి దానిలోపల ఇంటి నిర్మాణం చేసుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇదేమిటని ఎవరైనా అడిగితే తాను ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నానని చెప్పడం గమనార్హం. మరికొందరు ఈ స్థలాన్ని తమకు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలకు పైగా ధర పలుకుతోంది. అంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కాపాడేందుకు అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అక్కడ ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపి దాన్ని ఖాళీ చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు.
స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినా..
కోదాడ డివిజన్ వ్యవసాయ శాఖకు ఇన్నాళ్లుగా కనీసం సొంత కార్యాలయం లేదు. మార్కెట్ యార్డ్‌లో ఉన్న రైతు విశ్రాంతి గృహంలోనే కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు దాటింది. పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో వానొస్తే వలవల.. గాలొస్తే గలగల అనే చందంగా పరిస్థితి మారింది. భవనం కురుస్తుండడంతోపాటు స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండడంతో ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 32 మంది సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ సిబ్బంది కలెక్టర్ దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ నడిబొడ్డున ఉన్న తమ స్థలాన్ని అప్పగిస్తే రెండు అంతస్తుల్లో కార్యాలయం నిర్మించుకుంటామని, ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని వారు అంటున్నారు. ఇదే విషయంపై 20 రోజుల క్రితం కోదాడలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన ఆర్డీఓను ఆదేశించారు. కానీ కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment