మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించేలా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీవాణి పేర్కొన్నారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధ పరిష్కార చట్టంపై శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న చోట మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి మహిళలు ధైర్యంగా పనులు చేసుకునేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు స్వేచ్ఛగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు. వేధింపులకు గురైన మహిళల దరఖాస్తులను 90 రోజుల్లో కమిటీ మెంబర్లు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, ఏసీడీపీఓ రూప, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్ శిరీష, సభ్యులు లత, అనసూయ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్యనాయుడు, జెండర్ స్పెషలిస్టులు రేవతి, వినోద్, తేజస్విని, క్రాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment