విద్యార్థులు లక్ష్యం కలిగి ఉండటం ముఖ్యం
చివ్వెంల(సూర్యాపేట) : ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి దాని ప్రకారం ప్రణాళికతో ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి పి,శ్రీవాణి సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని విజయ్‌కాలనీలో గల బాలసదన్‌ను ఆమె సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే తమ భవిష్యత్‌కు బాటలు వేస్తుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, వ్యాయామం చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటవస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా వెల్ఫేర్ అధికారి కె,నర్సింహారావు, బి. రవికుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, జి.లింగమ్మ పాల్గొన్నారు.
డీటీఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
సూర్యాపేట: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీని సిటీ టాలెంట్ స్కూల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కొచ్చెర్ల వేణు, ఉపాధ్యక్షులుగా జి. వెంకటేశ్వర్లు, జె. రమణ, జి. ఆనంద్‌భాస్కర్‌తో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎస్. భాస్కర్ వ్యవహరించారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. ఎన్నికకు సహకరించిన డీటీఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు.
వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు
అర్వపల్లి: వచ్చే వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్‌పీడీసీఎల్ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ అట్లూరి కామేష్ తెలిపారు. రబీ సీజన్‌లో విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికై అడివెంల విద్యుత్‌సబ్ స్టేషన్‌ను సోమవారం ఎస్‌ఈ బి. ఫ్రాంక్లిన్, డీఈ ఎల్. ఎ. శ్రీనివాస్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న లోడ్, డిమాండ్‌ను తీర్చడానికి జిల్లాకు తనను ప్రత్యేక అధికారిగా నియమించారని చెప్పారు. అడివెంలలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 5ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఓవర్‌లోడ్ సమస్య ఉన్నందున వెంటనే సుమారు రూ. 1.20 కోట్లతో 8ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దీనిని మంగళవారం బిగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం ఏడీఈ రాములునాయక్, ఏఈ వాస శ్రీకాంత్, కాంట్రాక్టర్ వి. జానకిరెడ్డి, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment