గ్రామసభలకు వేళాయే..
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితా ఆమోదానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే తయారు చేసిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించి గ్రామసభ తీర్మానం ద్వారా ఆమోదించనున్నారు. ఇందుకోసం ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామసభల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సభల్లో అర్హుల జాబితా ఆమోదంతో పాటు నూతనంగా ఆయా పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. 25వ తేదీన తుది జాబితాలు రూపొందించి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవంలో అర్హులకు పథకాలను ప్రారంభించనున్నారు.
నాలుగు రోజుల పాటు నిర్వహణ
జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటికే గ్రామస్థాయిలో ఎంపిక చేసిన అర్హుల జాబితాలను సంబంధిత గ్రామసభ నిర్వహించే అధికారి ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత పథకానికి సంబంధించి ఏకగ్రీవంగా గ్రామసభ అర్హుల జాబితాను ఆమోదించినట్లు ప్రకటిస్తారు. లేదంటే సంబందిత పథకంపై ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయో వాటన్నింటిని లిఖిత పూర్వకంగా తయారు చేసి రికార్డుల్లో పొందుపరచాల్సి ఉంటుంది.
ఫ నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహణ
ఫ నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితా ప్రదర్శన
ఫ వాటి ఆమోదంతో పాటు నూతన దరఖాస్తుల స్వీకరణ
ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
దరఖాస్తుదారుల్లో టెన్షన్
రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాగా మార్చి సాగుకు యోగ్యమైన భూమికే ఎకరానికి రూ.12వేలను రెండువిడతల్లో ఇవ్వనుంది. గతంలో రైతుబంధు 6.19 లక్షల ఎకరాలకు అందగా.. జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్వేలో సాగుకు యోగ్యంగా లేని భూమి దాదాపు 6,339 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ భూమి వివరాలను గ్రామసభలో సర్వే నంబర్ వారీగా చదివి వినిపిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు ఉంటే మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. ఇక జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 3,09,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే 3,24,158 రేషన్ కార్డులు ఉండగా కొత్త కార్డుల కోసం 28వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చాయి. మరో 52 వేల దరఖాస్తులు పాత రేషన్ కార్డుల్లో పేర్లు చేర్పించేందుకు నమోదు చేసుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలను ఎంపిక చేయనున్నారు. ప్రజాపాలనలో 2,31,264 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా మంగళవారం నుంచి నిర్వహించే గ్రామసభల్లో తమ పేర్లు వస్తాయా..? రావా అన్న ఉత్కంఠతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment