ఫ్లైఓవర్ గుబులు!
అర్వపల్లిలో 365, 365బీ హైవేలు కలిచే చోట నిర్మాణానికి ప్రతిపాదన
రూ.20 లక్షలు నష్టపోయా
గతంలో హైవే విస్తరణ సందర్భంగా రూ.20లక్షల విలువ చేసే ఇంటిని కోల్పోయాను. ఇటీవలె తన వ్యవసాయ భూమి కొంత అమ్మి మళ్లీ కొత్తగా ఇల్లు కట్టుకున్నాను. ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే మళ్లీ కొత్తగా కట్టుకున్న ఇళ్లు కూడా కోల్పోతాను.
– కట్టెల కృష్ణ, అర్వపల్లి
ఇల్లు పోద్దని భయంగా ఉంది
365 హైవే వెంట జాజిరెడ్డిగూడెం రూట్లో రూ.40లక్షలతో కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నా. ఈ తరుణంలో ఫ్లైఓవర్ నిర్మాణమని నా ఇంటి ముందు నుంచే సర్వే చేశారు. ఇంతగానం కష్టపడి కట్టుకుంటున్న ఇల్లు పోద్దనే భయంగా ఉంది.
– గజ్జి శంకర్, అర్వపల్లి
ప్రజలకు అవసరం లేనిది ఎందుకు
మా స్వగ్రామం జాజిరెడ్డిగూడెం. ఇటీవల అర్వపల్లిలోని తుంగతుర్తి రోడ్డులో కొత్త ఇల్లు కట్టుకున్నాను. ఫ్లైఓవర్ నిర్మాణానికి సర్వే చేశారు. ఫ్లైఓవర్ నిర్మిస్తే ఇల్లు పోయే అవకాశం ఉంది. ప్రజలకు అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలి. – కోటమర్తి శ్రీనివాస్
అర్వపల్లి: సూర్యాపేట–జనగామ, నకిరేకల్–తానంచర్ల రెండు జాతీయ రహదారులకు ప్రధాన కూడలి అయిన జాజిరెడ్గిగూడెం మండలం అర్వపల్లిలో ఫ్లైఓవర్ నిర్మించాలని మళ్ల ప్రతిపాదన రావవడంతో స్థానిక ప్రజల్లో టెన్షన్ మొదలైంది. గతంలోనే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. సర్వే సందర్భంగా విషయం బయటకు రావడంతో స్థానికులు అప్పట్లో ఆందోళన బాటపట్టారు. ఇక్కడ అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణం ఎందుకంటూ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనను రద్దు చేయించారు.
ఇప్పటికే నష్టపోయిన ప్రజలు
గతంలో అర్వపల్లిలో 365, 365బీ రెండు జాతీయ రహదారుల విస్తరణ సందర్భంగా ఐదేళ్ల క్రితం 200 ఇళ్లు కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా తొలగించారు. అయితే ఇక్కడ పూర్తిగా దేవాదాయశాఖ భూమి కావడంతో ఇళ్ల యజమానులకు స్థలానికి సైతం నష్ట పరిహారం రాలేదు. కేవలం ఇళ్లకు మాత్రమే పరిహారం అందిచడంతో ఇళ్లు, దుకాణాల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. రెండు హైవేల విస్తరణ పూర్తయిన ఏడాదికే అప్పట్లో 365 హైవేపై స్థానికంగా ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు సర్వే మొదలు పెట్టడంతో ప్రజల ఆందోళన మూలంగా విరమించుకున్నారు.
మళ్లీ తెరపైకి ఫ్లైఓవర్
అర్వపల్లిలో జాతీయ రహదారుల విస్తరణ పూర్తయ్యాక వై జంక్షన్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హైవే అధికారులు అప్పట్లో ప్రకటించారు. కానీ, ఇంత వరకు జంక్షన్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదిలా ఉంటే ఇక్కడ ఎలాంటి అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి తెచ్చారు. అర్వపల్లిలో రెండు రోజులుగా హైవే అధికారులు సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సర్వేను సీతారాంపురం సమీపంలోని 71డీబీఎం కాలువ వద్ద నుంచి తుంగతుర్తి రోడ్డు వెంట వై జంక్షన్ మీదుగా జాజిరెడ్డిగూడెం రోడ్డులో ముదిరాజ్ కాలనీ సమీపం వరకు సర్వే చేపట్టారు. ఈ రోడ్డులోని సుమారు 200 ఇళ్లు, దుకాణాలను బ్రిడ్జి నిర్మాణంలో కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ఈ యజమానులంతా గతంలోనే రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయి అప్పులు చేసి మరీ కొత్తగా నిర్మించుకున్నారు. మరికొందరు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హైవే అధికారులు ఒక్కసారిగా మళ్లీ ఫ్లైఓవర్ అంటుండడంతో తామేం పాపం చేశామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లై ఓవర్ యోచనను విరమించుకొని వై జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి అవసరం లేని ఫ్లైఓవర్ నిర్మాణం వద్దని ముక్తకంఠంతో అంటున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం వద్దంటూ ఆందోళన బాట పట్టారు.
ఫ సర్వే కూడా మొదలు పెట్టిన అధికారులు
ఫ నిర్మిస్తే 200 ఇళ్లకు జరగనున్న నష్టం
ఫ గతంలోనే రద్దు చేసి మళ్లీ ఏమిటని ప్రశ్నిస్తున్న స్థానికులు
ఫ వద్దే వద్దంటూ ఆందోళన బాట
Comments
Please login to add a commentAdd a comment