రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం
హుజూర్‌నగర్: రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీ వద్ద రూ.14 కోట్లతో నిర్మించనున్న ఐటీఐ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని చదువుకున్న యువత కోసం అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ పనులు మొదలు పెట్టామని, ఇప్పుడు ఐటీఐ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశామన్నారు. దీనివలన ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందగలుగుతారని మంత్రి అన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల కోసం గతంలో మీ సేవ కేంద్రాల్లో, ప్రజావాణిలో, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నా పరిగణనలోకి తీసుకుని, వాటిని పరిశీలిస్తామన్నారు. హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీని రాష్టంలోనే ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కాలనీ తన పదేళ్ల తపస్సు అని, త్వరలో అన్ని బ్లాకుల పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా సింగిల్ రోడ్డు ఉండకుండా అన్ని డబుల్ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలని పేర్కొన్నారు. అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, సాగునీరు, తాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించారని, లబ్ధిదారుల జాబితాను ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామసభల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. జాబితాలో తమ పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామ సభలో దరఖాస్తులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈనెల 26 నుంచి నాలుగు పథకాలు అమలు పరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, ఆర్‌డీఓ శ్రీనివాసులు, ఉపాధి, శిక్షణ శాఖ ఆర్‌డీడీ ఎస్.రాజా, ప్రిన్సిపాల్ జింజిరాల వెంకన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్, అధికారులు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment