కోదాడలో ఆధునిక బస్‌స్టేషన్
రూ.17.95 కోట్లు
మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ డిపో గోడవైపు బస్టాండ్ నిర్మాణం
ఫ హైవే వైపు మల్టీ షాపింగ్ కాంప్లెక్స్
ఫ ప్రయాణికులకు సకల సౌకర్యాలు
ఫ త్వరలోనే సిద్ధంకానున్న ప్లాన్
కోదాడ: కనీస సౌకర్యాలకు నోచుకోని కోదాడ ఆర్టీసీ బస్టాండ్ దశ తిరగనుంది. గత నెలలో కోదాడ బస్టాండ్‌ను పరిశీలించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. శనివారం ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.17.95 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనిధులతో బస్టాండ్, ప్ర యాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు మల్టీస్టేర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. స్వయంగా ఆర్కిటెక్చరైన కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి బస్టాండ్ నిర్మాణం ప్రత్యేకత ఉండేలా ప్లాన్ తయారు చేయనున్నట్లు సమాచారం.
డిపో గోడవైపు మూడంతస్తుల్లో బస్టాండ్..
ప్రస్తుతం కోదాడ బస్టాండ్ అస్తవ్యస్థంగా తయారైంది. చాలా స్థలం ఖాళీగా ఉండడంతో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తబస్‌స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను కొంతకాలం పాటు అలాగే ఉంచి డిపో గోడవైపు ఉత్తరముఖంగా మూడు అంతస్తులతో బస్టాండ్‌ను నిర్మించనున్నారు. కింది అంతస్తులో ప్లాట్ ఫాంల నిర్మాణం, విశ్రాంతి గదులు, రెండవ అంతస్తులో అధికారుల కార్యాలయాలు, మూడవ అంతస్తులో సిబ్బంది విశ్రాంతి గదులు నిర్మించనున్నట్లు తెలిసింది.
ముందువైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
కొత్త బస్టాండ్ భవన నిర్మాణం పూర్తయిన తరువాత ప్రస్తుత బస్టాండ్, డ్రైవర్ల విశ్రాంతి భవనం, ముందు వైపుఉన్న షాపింగ్ కాంప్లెక్స్, ఇతర దుకాణాలను పూర్తిగా కూల్చివేసి బహుళ అంతస్తులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నారు. హైవేవెంట ఉండడంతో దుకాణాలు ఏర్పాటుచేసి ఆదాయం సమకూర్చుకోవాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కోసం ఆధునిక హంగులతో గార్డెన్ కూడా నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
రోల్ మోడల్‌గా ఉంటుంది
రాష్ట్రంలోనే అన్ని బస్టాండ్‌లకు రోల్ మోడల్‌గా ఉండేలా కోదాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయిస్తాను. త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దీని నిర్మాణంపై ప్రణాళిక తయారు చేయిస్తాను. ఇచ్చిన మాట ప్రకారం కోదాడ పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను.
– నలమాద పద్మావతిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment