మీడియాతో మాట్లాడుతున్న రజనీకాంత్
● నిర్మలా సీతారామన్ ● స్నేహానికి ప్రతీక...రజనీ వ్యాఖ్య
సాక్షి, చైన్నె : గొప్ప మానవత్వం కలిగిన నాయకుడు కెప్టెన్ విజయకాంత్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. కెప్టెన్‌కు నివాళులర్పించినానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తాను ఇక్కడకు నివాళులర్పించేందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. అందరికీ పెన్నిధిగా, స్నేహితుడిగా, గొప్ప మనస్సున్న, మానవత్వం కలిగిన నేతగా ఆయన ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడని కొనియాడారు. విజయకాంత్ ఇక లేరన్న సమాచారంతో తక్షణం ప్రధాని నరేంద్ర మోదీ తనను చైన్నెకు వెళ్లమని ఆదేశించారని పేర్కొన్నారు. ఆ కుటుంబం దుఃఖంలో తాను పాలు పంచుకుంటున్నానని వ్యాఖ్యలు చేశారు.
స్నేహానికి ప్రతీక
విజయకాంత్ స్నేహానికి ప్రతీక అని దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ,ఒక్క సారి విజయకాంత్‌తో పరిచయం ఏర్పడితే చాలు జీవితాంతం ఆయనతో స్నేహం కొనసాగుతుందని పేర్కొన్నారు. నమ్మకున్న వారికి, స్నేహితుల కోసం ప్రాణమైనా ఇస్తాడని కొనియాడారు. ఆయనకు కోపం సహజం అని, అయితే, అందులో న్యాయం తప్పకుండా ఉంటుందన్నారు. స్వలాభా పేక్ష లేని వ్యక్తి అని పేర్కొన్నారు. విశ్వనటుడు కమలహాసన్ మాట్లాడుతూ, నిజాయితీ కలిగిన మంచి స్నేహితుడు అని ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. విజయకాంత్ కోపంలోనూ అభిమానం కనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక, నటుడు అజిత్ , ప్రకాష్ రాజ్, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్, నటుడు ధనుష్ విజయకాంత్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment