సిట్‌కు..అన్నావర్సిటీ కేసు
● రంగంలోకి ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారిణులు ● బాధితురాలికి రూ. 25 లక్షలు నష్ట పరిహారం ● హైకోర్టు ఆదేశాలు ● వర్సిటీలో గవర్నర్ రవి పరిశీలన
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసు విచారణను సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)కు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు శనివారం ఉత్తర్వులుజారీ చేసింది. ఈ కేసు విచారణకు ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారిణులు రంగంలోకి దిగారు. బాధితురాలికి తాత్కాలిక నివారణగా రూ. 25 లక్షలు నష్ట పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. వివరాలు.. అన్నావర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి వ్యవహారం పెను వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. నిందితుడు జ్ఞాన ఖర్‌ను అరెస్టు చేసి కటకటాలోకి నెట్టారు. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే, బీజేపీలు డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం దృష్టి సారించింది. నిజ నిర్ధారణ కమిటీని రంగంలోకి దించింది. మహిళా కమిషన్ సభ్యులు మమత కుమారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ దీక్షిత్ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు. అదే సమయంలో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మద్రాసు హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్ర మణియన్, వి. లక్ష్మీనారాయణన్ బెంచ్‌లో జరిగిన వా దనల అనంతరం ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ కేసును సిట్‌కు అప్పగించాలని న్యాయమూర్తు లు ఆదేశించారు. అన్నానగర్‌లో ఇటీవల చోటు చేసుకున్న మానసిక వికలాంగురాలిపై జరిగిన లైంగిక దా డి కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరుపుతున్న మహిళ ఐపీఎస్ అధికారిణులు స్నేహ ప్రియ, జమాల్, బృందాల నేతృత్వంలోని సిట్ బృందానికే అన్నావర్సిటీ లైంగిక దాడి కేసును సైతం అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే బాధితురాలికి తాత్కాలిక నివారణగా రూ. 25 లక్షలు నష్ట పరిహారంగా అందజేయాలని, ఆమె వద్ద నుంచి ఎలాంటి ఫీజులు వసూళ్లు చేయడానికి వీలు లేదని, విద్యాపరంగా అన్ని ఖర్చు లు ప్రభుత్వ బాధ్యతగా సూచించారు. ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించారు. అలాగే ఎఫ్‌ఐఆర్ లీక్ వ్యవహారం, అనుమతి లేకుండా చైన్నె పోలీసు కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టడం వంటి అంశాలను పరిగణించిన న్యాయమూర్తులు చట్టపరంగా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
గవర్నర్ పరిశీలన
అన్నావర్సిటీలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి పరిశీలన జరిపారు. ఆ వర్సిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఇక్కడున్న ఏర్పాట్లను వీక్షించారు. విద్యార్థులకు భద్రత పరంగా తీసుకున్న చర్యలను పరిశీలించారు. గంటపాటూ అక్కడే ఉన్న గవర్నర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇక్కడి సీసీ కెమెరాల పనితీరుతో పాటూ విద్యార్థులకు , విద్యార్ధినులకు సంబంధించిన సమగ్ర వివరాల సేకరణ, వారికి కల్పిస్తున్న వసతులు, భద్రత తదితర అంశాల గురించి చర్చించి, ఇక మరింత కఠినంగా అమలు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గవర్నర్ రాకతో వర్సిటీ ఆవరణలోకి కనీసం మీడియాను కూడా అనుమతించక పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment