‘బుల్లెట్ రాజా’ను బంధించిన అధికారులు
● టాప్‌స్లిప్ శిబిరానికి తరలింపు
సేలం : నీలగిరి జిల్లా పందలూర్ సమీపంలోని సేరంగోడు, చుట్టుపక్కల ప్రాంతాలలో గత నెల రోజులుగా తిరుగుతూ గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన బుల్లెట్ రాజా అనే అడవి ఏనుగును శుక్రవారం అటవీ శాఖ అధికారులు మత్తు సూది వేసి బంధించారు. దాన్ని శనివారం టాప్‌స్లిప్ శిబిరానికి తరలించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వివరాలు.. బుల్లెట్ రాజా ఏనుగు గత నెల రోజుల్లో 48కి పైగా నివాసాలను ధ్వంసం చేసింది. బియ్యం, పప్పు వంటి వస్తువులను తిని, పంట పొలాలను ధ్వంసం చేసింది. దీంతో ఆ ఏనుగను బంధించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో 75 సిబ్బందితో కూడిన అటవీ శాఖ సిబ్బంది, కుమ్కి ఏనుగుల సహకారంతో బుల్లెట్ రాజా సంచారాన్ని పరిశీలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సేరంపాడి ప్రాంతంలో బుల్లెట్ రాజా ఏనుగు ఉన్నట్లు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు డాక్టర్ రాజేష్ కుమార్ బుల్లెట్ రాజాపై మత్తు సూది వేసి విజయ్, శీనివాసన్ అనే కుంకీ ఏనుగుల సాయంతో బంధించారు. తర్వాత దాన్ని కోవై జిల్లా పొల్లాచి సమీపంలోని టాప్‌స్లిప్ ఏనుగుల శిబిరానికి తరలించారు. అక్కడికి శనివారం ఉదయం చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment