‘కెప్టెన్’కు కన్నీటి అంజలి
సాక్షి, చైన్నె: డీఎండీకే దివంగత అధినేత, కెప్టెన్ విజయకాంత్‌కు శనివారం ఆ పార్టీ వర్గాలు కన్నీటి అంజలి ఘటించాయి. తొలి వర్ధంతిని గురుపూజోత్సవంగా నిర్వహిచారు. పోలీసు నిషేధాన్ని ఉల్లంఘించి మౌన ర్యాలీ నిర్వహించారు. సమాధి వద్ద శాశ్వతంగా వెలిగే జ్యోతిని ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నేతలు తరలి వచ్చి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. వివరాలు.. కరుప్పు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్), కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవనటుడు)గా అశేషాభిమానుల హృదయాలలో విజయ్‌రాజ్ నాయుడు అలియాస్ విజయకాంత్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వెండి తెర మీదే కాదు, రాజకీయాలలోనూ రాణించే సమయంలో అనారోగ్య సమస్యలు ఆయన్ని ముందుకు సాగనివ్వకుండా చేశాయి. గత ఏడాది డిసెంబరు 28వ తేదీన ఆయన తుది శ్వాసను విడిచారు. ఆయన మరణం తమిళ సినీ రంగానికే కాదు, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా మారింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా, ఎవరికి కష్టం, నష్టం వచ్చినా ముందుండే గొప్ప మానవతావాదిగా ముద్ర పడ్డ కెప్టన్ అందర్నీ వీడి శనివారంతో ఏడాది అయింది. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని గురుపూజోత్సవంగా డీఎండీకే వర్గాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాడ వాడలలో విజయకాంత్ చిత్ర పటాలను కొలువు దీర్చి పుష్పాంజలితో నివాళులర్పించారు. కోయంబేడులోని పార్టీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో శాశ్వత నిద్రలో ఉన్న విజయకాంత్ సమాధి వద్దకు తండోప తండాలుగా డీఎండీకే కేడర్ తరలి వచ్చారు. కెప్టెన్ ఆలయంగా పిలవడే ఆ ప్రదేశంలో కన్నీటి నివాళులతో తమ అభిమానం చాటుకున్నారు.
భారీ ర్యాలీగా..
కోయంబేడు సమీపంలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద నుంచి విజయకాంత్ సమాధి వరకు ర్యాలీ నిర్వహించేందుకు డీఎండీకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోయంబేడు పరిరాలు నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండటమే ఇందుకు కారణం. అయినా నిషేధాన్ని ఉల్లంఘించి ర్యాలీకి సిద్ధమయ్యారు. ఉదయాన్నే ఐదు గంటల నుంచి డీఎండీకే వర్గాలు, అభిమాన లోకం నల్ల వస్త్రాలను ధరించి తరలి రావడంతో ఉత్కంఠ నెలకొంది. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, విజయకాంత్ కుమారులు విజయప్రభాకరన్, షణ్ముగ పాండియన్, బావ మరిది సుదీష్‌తో పాటూ పార్టీ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. విజయకాంత్ చిత్ర పటంతో అలంకరించిన వాహనం సైతం సిద్ధం చేశారు. విజయకాంత్ సమాధి వద్ద ఉంచేందుకు సిద్ధం చేసిన శాశ్వతంగా వెలిగే జ్యోతిని చేత బట్టి ప్రేమలత ముందుకు సాగారు. పోలీసులు అడ్డుకోలేనంతగా కేడర్ తరలి రావడంతో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ర్యాలీ ముందుకు సాగింది. ఉదయం 9.30 గంటల సమయంలో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. కెప్టెన్ ఆలయంలో ఈ జ్యోతిని ప్రేమలత విజయకాంత్ ప్రతిష్టించి నివాళులర్పించారు. ఈ సమయంలో డ్రోన్ల ద్వారా పువ్వుల వర్షం కురిపించారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, మంత్రి శేఖర్‌బాబు, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటూ పలు పార్టీల నాయకులు, సినీ రంగానికి చెందిన పలువురు అక్కడికి చేరుకుని విజయకాంత్ సమాధి వద్ద నివాళులర్పించారు. సీఎం స్టాలిన్ ఎక్స్‌పేజీలో విజయకాంత్‌కు నివాళుర్పించే విధంగా ఆయన ఘనతను, ఆయన మానవతా హృదయాన్ని గుర్తు చేస్తూ మనస్సున్న మహారాజు అని వ్యాఖ్యలు చేశారు.
నిషేధం ఉల్లంఘించి మరీ ర్యాలీ
సమాధి వద్ద శాశ్వత జ్యోతి
తరలి వచ్చిన నేతలు
Comments
Please login to add a commentAdd a comment