ఆహాఫైండ్ ఖాతాలో బయోస్కోప్
తమిళసినిమా: ఇంతకు ముందు వెంకాయమ్మ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శంకరగిరి రాజ్ కుమార్. ఈయన తాజాగా 25 డాట్స్ క్రియేషన్స్ పతాకంపై కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం బయోస్కోప్. చంద్ర సూరియన్, ప్రభు, పెరియ సామి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్ర విడుదల హక్కులను ప్రొడ్యూసర్ బజార్ సంస్థ పొంది ఈ నెల 3న విడుదల చేయనున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్, దర్శకుడు చేరన్ అతిథి పాత్రలు పోషించగా, పలువురు గ్రామీణ నటీనటులు ప్రధాన పాత్రలు నటించారు. తాజ్ నూర్ సంగీతాన్ని, మురళి గణేష్ ఛాయాగ్రహణం అందించిన ఈ ఓటీటీ హక్కులను ఆహా ఓటీటీ సంస్థ పొందింది. ఇలాంటి సహజత్వంతో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రాల కోసం ఈ సంస్థ ఆహా ఫైండ్ పేరుతో కొత్తగా ఓటీటీ విభాగాన్ని ప్రారంభించింది. ఆహా ఫైండ్ ద్వారా స్ట్రీమింగ్ కానున్న తొలి చిత్రం బయోస్కోప్ అని ఆ సంస్థ సీఈఓ కవిత సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలకు అద్ధం పట్టే వైవిధ్య భరిత చిన్న కథా చిత్రాలను ఆహా ఫైండ్ ప్రోత్సహిస్తుందని ఆమె పేర్కొన్నారు. సినిమా గురించి తెలియని ఒక గ్రామీణ కుటుంబం చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతుందని, సినిమాను తెరకెక్కించాలనే తన మానవుడి ఆశను నెరవేర్చడానికి తాతా బామ్మలు ఏ విధంగా సహకరించారు? అందుకు ఎలాంటి త్యాగాలు చేశారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన చిత్రం బయో స్కోప్ అని దర్శకుడు శంకరగిరి రాజ్ కుమార్ తెలిపారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఆహా ఫైండ్ సంస్థ పొంది తమ లాంటి దర్శకులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆహా ఫైండ్ లోగోను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment