పుష్ప సోయగం
● సెమ్మోళి పార్కులో బ్రహ్మాండ ప్రదర్శన
● ప్రారంభించిన సీఎం స్టాలిన్
● 18వ తేదీ వరకు నిర్వహణ
సాక్షి, చైన్నె: ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడు వంటి ప్రదేశాలలో అబ్బుర పరిచే రీతిలో సాగే పుష్ప ప్రదర్శన చైన్నెకు కదలి వచ్చింది. వివిధ వర్ణ పుష్ప శోభితంగా సెమ్మోళి పార్కు అలరారుతోంది. పుష్ప సోయగాలు సందర్శకులకు కనువిందుగా మారాయి. ఈ పుష్ప ప్రదర్శనను గురువారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. వివరాలు.. వేసవి వస్తున్నదంటే చాలు ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడు వంటి ప్రదేశాలలో వ్యవసాయం – రైతు సంక్షేమ శాఖ పరిధిలోని హార్టికల్చర్, ఉద్యనవన విభాగం నేతృత్వంలో నీలగిరి, కొడైకెనాల్, ఏర్కాడు వంటి పర్యాటక ప్రదేశాలలో బ్రహ్మాండ పుష్ప ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రదర్శనలను తిలకించేందుకు పెద్దఎత్తున పర్యాటకులు పోటెత్తడం జరుగుతోంది. వందలాది రకాల లక్షలాది పుష్పాలు ఇక్కడ కొలువు దీరుతుంటాయి. వివిధ పుష్ప ఆకృతులు కనువిందే. ఈ వాతావరణాన్ని చైన్నెలోకి తీసుకొస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. ఇది వరకు కలైవానర్ అరంగం, సెమ్మోలి పార్కులో రెండు రోజుల పాటూ పుష్ప ప్రదర్శనకు చర్యలు తీసుకున్నారు. తాజాగా సెమ్మోళి పార్కు వేదికగా ఏకంగా రెండు వారాలకు పైగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సందర్భాంగా ఈ పుష్పప్రదర్శన మరింత కనువిందు కాబోతున్నది. ఇందుకు కారణం ఈనెల18వ తేదీ వరకుప్రదర్శన కొనసాగనుండడమే. రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం ఆరు గంటలకు వరకు ప్రదర్శనను తిలకించే వారికి ప్రవేశ టికెట్లను అందజేయనున్నారు. ఈ ప్రదర్శను ప్రారంభించిన సీఎం స్టాలిన్ అక్కడి పుష్పాలు, వివిధ ఆకృతులను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురై మురుగన్, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, ఎమ్మెల్యే వేలు, సీఎస్ మురుగానందం , వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి అపూర్వ, డైరెక్టర్ మురుగేష్ పాల్గొన్నారు.
మహిళా నైపుణ్యాభివృద్ధికేంద్రం
చైన్నెలోని సైదాపేటలో కలైంజ్ఞర్ కరుణానిధి మహిళా నైపుణ్యాభివృద్ధి కేంద్రం (కలైంజ్ఞర్ ఉమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్)ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. మంత్రులు ఎం. సుబ్రమణియన్, శేఖర్ బాబు, మేయర్ ప్రియ, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌లతో కలిసి ఈ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ద్రావిడ ఉద్యమం సమాజంలో ఉన్న అసమానతలను తొలగించిందని గుర్తు చేస్తూ, సమానత్వం కోసమే తమ ఉద్యమం అంటూ ఇందులో లింగ సమానత్వం కూడా ముఖ్యం అని వివరించారు. మహిళ హక్కుల కోసం, వారి అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. మహిళలు ప్రపంచ జ్ఞానాన్ని పొందాలన్న కాంక్షతో ప్రత్యేక కసరత్తులు చేస్తున్నామన్నారు. మహిళలు బలోపేతమైనప్పుడు సమాజం అండగా నిలుస్తుందని, మహిళా సాధికారత నేడు తమిళనాడు అభివృద్ధికి దోహదకరంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలేకాదు భవిష్యత్తులో మహిళల కోసం మరెన్నో ప్రాజెక్టుల రూపకల్పన మీద దృష్టి పెట్టామని ప్రకటించారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్‌సెంటర్ మహిళలకు మరింత బలాన్ని కలిగిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment