తమిళసినిమా: ప్రముఖ దివంగత నటుడు మురళి రెండవ వారసుడు ఆకాశ్ మురళి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నేశిప్పాయా. ఎక్స్‌బీ ఫిలిం థియేటర్స్ పతాకంపై సేవియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రానికి స్నేహా బ్రిట్టో సహ నిర్మాతగా వ్యవహరించారు. దీనికి కథ, దర్శకత్వం బాధ్యతలను విష్ణువర్ధన్ నిర్వహించారు. నటి అదితి శంకర్ నాయకిగా నటించిన ఇందులో నటుడు శరత్ కుమార్, ప్రభు, కుష్బూ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా ఈనెల 14న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నె, చెట్‌పెట్‌లోని లేడీ ఆండాల్ స్కూల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు శివకార్తికేయన్, విజయ్ ఆంటోని, నిర్మాత కలైపులి ఎస్ థాను, నటుడు అధర్వ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహ నిర్మాత స్నేహ బ్రిట్టో మాట్లాడుతూ విష్ణువర్ధన్ స్టైలిష్ దర్శకుడు ఈ చిత్రం కూడా అలాగే రూపొందిందన్నారు. నటుడు ఆకాశ్ మురళి కిది తొలి చిత్రం. అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. నటుడు ఆకాష్ మురళి సోదరుడు నటుడు అధర్వ మురళి మాట్లాడుతూ చిత్రానికి చిరునవ్వుతోనే ఖర్చు చేసిన నిర్మాత సేవియర్ బ్రిట్టో, దర్శకుడు విష్ణువర్ధన్‌లో హీరో ఆకాశ్ మురళి అని చెప్పుకోవడమే ఘనత అన్నారు. నటి అదితి శంకర్ చాలా చక్కగా నటించారని, ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుండడం సంతోషకరమన్నారు. కొడుకుల కలలను తమ కలలుగా భావించే తల్లులలో తమ అమ్మ ఒకరిని, ఆమె ఆశీస్సులు ఆకాష్ మురళికి ఉన్నాయని అధర్వ అన్నారు. నటి అదితి శంకర్ మాట్లాడుతూ తన తండ్రి శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్, తాను నటించిన నేశిప్పాయా చిత్రం పోటీ పడబోతున్నట్లు కొందరు అంటున్నారని, అయితే అలాంటిదేమీ లేదని ఈ రెండు చిత్రాలతో ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందుతుందని అభిప్రాయపడ్డారు. తను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం మరో పది రోజుల్లో తెరపైకి రానుండటం సంతోషంగా ఉందన్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దర్శకుడు విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment