అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
● ఆమ్నీ బస్సు నిర్వాహకులకు ప్రభుత్వం హెచ్చరిక ● రంగంలోకి 30 బృందాలను దించాలని నిర్ణయం ● సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్ ● నేడు బస్సుల వివరాలు వెలువడే అవకాశం
సాక్షి, చైన్నె: సంక్రాంతి సందర్భంగా అధిక చార్జీలను వసూళ్లు చేస్తే కొరడా ఝుళిపిస్తామని ఆమ్నీ ప్రైవేటు బస్సులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 30 బృందాలను రంగంలోకి దించేందుకు నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలోని వారు తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్తుంటారు. ఈసారి సంక్రాంతికి తొలుత 14, 15,16 తేదీలు మూడు రోజులే సెలవు అని అందరూ భావించారు. అయితే 17వ తేదీ కూడా సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శని, ఆదివారాలు కలిసి వచ్చినట్లయ్యింది. ఏకంగా పండుగకు ఈసారి ఏడు రోజులు వచ్చేసినట్లయ్యింది. అదే సమయంలో 13వ తేదీ ఎవరైనా స్చచ్ఛందంగా సెలవు పెట్టుకున్న పక్షంలో 11,12 తేదీలైన శని, ఆదివారాలు సైతం కలిసి వస్తాయి. దీంతో ఏకంగా తొమ్మిది రోజులు సెలవు దక్కినట్టే. దీంతో చైన్నె వంటి నగరాలలో ఉన్న వాళ్లు తమ తమ స్వస్థలాలకు బయలు దేరి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు, రైళ్ల రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే సాధారణంగా సాగే రైళ్లును ఫుల్ అయ్యాయి. అదనంగా నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా, ఆదివారం వాటి రిజర్వేషన్లు హౌస్ పుల్ అయ్యాయి. ఇక ప్రభుత్వ ప్రత్యేక బస్సుల వివరాలు సోమవారం వెలువడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రైవేటు ఆమ్నీ బస్సులను ఆశ్రయించే వాళ్లు ఎక్కవే కావడంతో వాటి యాజమాన్యాలు చార్జీలను పెంచే పనిలో పడ్డాయి. దీనిని పరిగణించిన ప్రభుత్వం ఆదివారం హెచ్చరికలతో ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. అధిక చార్జీలను వసూలు చేసిన పక్షంలో ఆయా బస్సుల పర్మినెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తామన్న హెచ్చరికలు జారీ చేశారు. ఆమ్నీ బస్సులలో అధిక చార్జీల వసూళ్లపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతూ ప్రకటన చేశారు. ఈ మేరకు 30 బృందాలను రంగంలోకి దించేందుకు నిర్ణయించారు.
నేటి నుంచి రిజిస్టేషన్లు
ఈ ఏడాదిలో తొలి జల్లికట్టు శనివారం పుదుకోట్టై జిల్లా తచ్చాంకురిచ్చిలో జరిగిన విషయం తెలిసిందే. తొలి మంజు విరాట్ పోటీ అన్నది ఆదివారం అదే జిల్లా పరిధిలోని పొన్ అమరావతిలో అత్యంత వేడుకగా జరిగింది. ఇక సంక్రాంతి సందర్భంగా జరిగే జల్లికట్టు రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన మదురై జిల్లా అవనీయాపురంలో 14వతేదీన, పాలమేడులో 15వ తేదీన, అలంగానల్లూరులో 16వ తేదీన జరగనున్న జల్లికట్టు పాల్గొనే ఎద్దులు, క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment