‘సింధు’ నాగరికతతో తమిళ బంధం
● శతాబ్ధి ఉత్సవంలో సీఎం స్టాలిన్ వ్యాఖ్య ● నిదర్శనంగా పురావస్తు ఆధారాలు ● లిపిపై స్పష్టత ఇస్తే.. మిలియన్ అమెరికన్ డాలర్ల కానుక ● ఇకపై ఏటా పురావస్తు పరిశోధకులకు అవార్డులు
ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో చైన్నె ఎగ్మూర్ ప్రభుత్వ మ్యూజియం ఆడిటోరియంలో సింధూ నాగరికత శతాబ్ధి ఉత్సవం ఆదివారం జరిగింది. అంతర్జాతీయ సదస్సుగా జరిగిన ఈ వేడుకకు సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. ఈ ఉత్సవాలను ప్రారంభించడమే కాకుండా, పురావస్తు పరిశోధనలకు సంబంధించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. పురావస్తు పరిశోధకులను సత్కరించారు. జాన్ మార్షల్ విగ్రహాన్ని మ్యూజియం ఆవరణలో రూ. 50 లక్షలతో ఏర్పాటు చేయడానికి నిర్ణయించి ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, సింధూ లోయ నాగరికత తొలిసారిగా 1924 సెప్టెంబర్ 20 వతేదీన ప్రపంచానికి చాటినట్లు గుర్తు చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ లండన్ పత్రిక వేదికగా చేసిన ఈ ప్రకటన భారత ఉపఖండ చరిత్రను ఓ మలుపు తిప్పిందన్నారు. ఇది మన గతాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆర్యులు సంస్కృతం భారతదేశానికి మూలం అని కల్పిత ప్రచారం చేస్తూ వచ్చిన వారికి జాన్‌మార్షల్ అధ్యయనం ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చిందన్నారు. ఆర్యులకు పూర్వం సింధూలోయ నాగరికతలో మాట్లాడే భాష ద్రావిడం కావచ్చు అన్న మార్షల్ వ్యాఖ్యలకు నేటికీ బలం గళం రూపంలో జ్వలిస్తున్నదన్నారు. సింధూ లోయలో నాగరికత అభివృద్ధి, అక్కడి రక రకాల చిహ్నాలు తమిళ బంధానికి ముడి పడి ఉన్నాయని వివరించారు. సింధూ లోయ నుంచి తమిళనాడులోని మదురై అలంగానల్లూరు వరకు ఎద్దులు ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇది తమిళ చిహ్నం అని వ్యాఖ్యలు చేశారు. ఎద్దులను మచ్చిక చేసుకోవడం, వాటి పొగరు అణచి వేసే దిశగా దూసుకెళ్లడం కూడా తమిళ సంస్కృతిలో ఉందన్నారు. ఇక గుర్రపు ముద్ర , దైవారాధనకు దూరం అంటూ అనేక చిహ్నాలు సంఘ తమిళుల పూర్వీకుల ప్రదేశంగా సింధూ లోయ బాసిల్లినట్టుగా అనేక కథనాలలో పేర్కొనబడి ఉన్నట్టు వివరించారు. సింధూలోయ సంస్కృతి , తమిళ సంస్కృతిని ఏకీకృతం చేసే ముఖ్య పరిశోధనా పత్రాలను చదవాల్సిన అవశ్యం ఉందని సూచించారు.
ఆధారాలెన్నో..
శివగంగై జిల్లా, కీజాడి ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలపై ప్రపంచ స్థాయిలో అందరి దృష్టి పడిందన్నారు. ఆదిచ్చనల్లూరు, తామర భరణి నదీ తారంలో అధ్యయనాలు, తవ్వకాలలో బయట పడ్డ వివిధ వస్తువులు, చిహ్నాలన్నీ సింధూ వర్ణమాలతో ముడి పడి ఉండటం గమనించాల్సిన విషయంగా పేర్కొన్నారు. సింధూ లోయలో ఉపయోగించిన అనేక చిహ్నాలు, తమిళనాడులోని ఆదిచ్చనల్లూరు, మైలాడుతురై, మాంగాడు వంటి వివిధ ప్రాంతాలలో పురావస్తు తవ్వకాలలో వెలుగు చూసిన చిహ్నాల మధ్య అనేక పోలికలు ఉన్నాయన్నారు. దక్షిణభారత దేశం, సింధూ లోయ నాగరికత మధ్య సాంస్కృతిక బంధం కొనసాగింపును ఈ చిహ్నాలు తేట తెల్లం చేస్తున్నాయన్నారు. తమిళనాడు, తమిళ సంస్కృతిని పరిరక్షించడం తన ప్రభుత్వం కర్తవ్యం అని పేర్కొంటూ, కొన్ని ప్రకటనలు చేశారు. సింధూ సంస్కృతి రచనా విధానం ఇప్పటికే స్పష్టంగా అర్థం చేసుకోలేకున్నామని, ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రం, తమిళ పండితులు, ఆధునిక సాంకేతికత నిపుణులతో సహా చాలా మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. సింధూ రచన విధానాన్ని కనుగొని స్పష్టత ఇచ్చే వారికి మిలియన్ అమెరికన్ డాలర్లు కానుకగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే, సింధూ లోయ సంస్కృతిపై నిరంతర పరిశోధనలు చేస్తే రాజా ముత్తయ్య ఆర్కియాలజీ లైబ్రరీ, సింధూ పరిశోధన కేంద్రం ద్వారా శాస్త్ర వేత్త ఐరావతం మహాదేవన్ పేరిట థీసిస్ ఏర్పాటుకు రూ. 2 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. తమిళ సంస్కృతి ప్రాచీనతను ప్రపంచానికి తెలియజేయడంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న పురావస్తు పరిశోధకులు ఇద్దరికి ఏటా అవార్డులను అందజేయనున్నామన్నారు. సింధూ లోయ నుంచి కీలడి వరకు తమిళుల గౌరవం ఇనుమడించి ఉందని, ఎన్నో అధ్యయనాలు, ఆవిష్కరణలు ఇందుకు నిదర్శం అని తెలిపారు. భారత ఉపఖండ చరిత్ర ఇకపై తమిళం లేకుండా రాయలేమన్నది స్పష్టం అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, స్వామినాథన్, శేఖర్ బాబు, మేయర్ ప్రియ, సీఎస్ మురుగానందంతో పాటూ పురావస్తు శాస్త్ర వేత్తలు, పరిశోధకలు , దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నేతృత్వంలో ఉత్సవంగా..
2021లో అధికార పగ్గాలు చేపట్టగానే తన ప్రభుత్వానికి ద్రావిడ మోడల్ అని పేరు పెట్టానని, ఇది ఓ పార్టీకి, రాష్ట్రానికి సంబంధించినది కాదని, ఒక సమూహం అని పేర్కొంటూ, ఈ సమూహ చరిత్రను పరిశోధనా దృక్పథంతో చూస్తే అన్ని అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. సింధూ లోయ నాగరికతను కనుగొన్న శతాబ్ధి ఉత్సవాన్ని భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని రీతిలో వేడుకను తమ ప్రభుత్వమే ఒక గొప్ప సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత ఉపఖండ చరిత్రలో తమ స్థానం నిలబెట్టుకోవడమే లక్ష్యం!, చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం, దూరదృష్టి, దార్శనిక కార్యక్రమాలు తమిళనాడుకే గర్వకారణం అన్నారు. సింధూ లోయ నాగరికత ఆవిష్కరణ శతాబ్ధి ఉత్సవాలను తమిళనాడు ప్రభుత్వ పురావస్తు శాఖ, రీసెర్చ్ లైబ్రరీకి చెందిన ఇండస్ వ్యాలీ రీసెర్చ్ సెంటర్ సహకారంతో అంతర్జాతీయ సదస్సుగా నిర్వహించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఇందులో విదేశీయులు సైతం పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందన్నారు. జాన్ మార్షల్ విగ్రహానికి తానే శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందంటూ సింధు లోయ సంస్కృతిని కనుగొనడం ద్వారా, మనచరిత్ర కీర్తిని మార్షల్ పునరుద్ధరించారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment