నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, చైన్నె: 2025 సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం సోమవారం ప్రారంభం కానుంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగంతో సమావేశాలకు శ్రీకారం చుట్టనున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా వివాదాలకు ఆస్కారం లేకుండా గవర్నర్ ప్రసంగం సాగేనా..? అన్న ఎదురుచూపులు నెలకొన్నాయి. అదే సమయంలో డీఎంకే సర్కారును ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు సిద్ధమయ్యాయి. తొలిరోజే శాంతి భద్రతలపై నిరసనలను హోరెత్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం సచివాలయానికి బాంబు బూచీ రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వివరాలు.. గత ఏడాది అసెంబ్లీ సమావేశాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగాయి. ఆ తరువాత జూన్‌లో నిర్వహించారు. చివరగా గత నెల 9, 10 తేదీలలో చివరి సమావేశం జరిగింది. అయితే గత ఏడాది వంద రోజుల పాటుగా సభా వ్యవహారాలు జరగ లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆనవాయితీ ప్రకారం 2025 కొత్త సంవత్సరంలో తొలి సమావేశం గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలపై శాఖల వారీగా అధికార వర్గాలు కసరత్తులు పూర్తి చేసి ఆంగ్లం, తమిళంలో పాఠాన్ని సిద్ధం చేశారు. ఇందులోని అంశాలను ఏ మేరకు గవర్నర్ ప్రస్తావిస్తారో అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం గత 2 సంవత్సరాలుగా గవర్నర్ ప్రసంగం వివాదాల నడుమ సభలో సాగడమే. తొలి ఏడాది ప్రభుత్వ ప్రసంగాన్ని పక్కన పెట్టి గవర్నర్ తన సొంత అభిప్రాయాలను తెలియచేయడం పెద్ద వివాదానికే దారి తీసింది. ఈ సమయంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా సభలో తీర్మానం కూడా చేశారు. రెండవ ఏడాది దీనికి కొనసాగింపుగా గవర్నర్ ప్రసంగం పాటంలోని తొలి పేజీ, చివరి పేజీని మాత్రమే చదివి మమా అనిపించారు. ఈ దృష్ట్యా, సోమవారం జరగనున్న సమావేశాలో గతం పునరావృతమయ్యేనా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే గవర్నర్‌ను ఇప్పటికే స్పీకర్ అప్పావు కలిసి సభకు రావాలని ఆహ్వానించి వచ్చారు. ఈ సమావేశంలో జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా, ఫెంగల్ తుపాన్ నివారణకు నష్ట పరిహారం విడుదలలో కేంద్ర ప్రభుత్వ తీరు, తదితర అంశాల ఆధారంగా తీర్మానాలను సభ ముందుకు ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిఘా కట్టుదిట్టం
అన్నావర్సిటీ వ్యవహారం, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిణామాలు వంటి అంశాలను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకేలు పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. ఇది అసెంబ్లీలోనూ కనిపించనున్నాయి. డీఎంకే ప్రభుత్వంతో ఢీకొట్టే విధంగా ప్రతి పక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుని సభకు రాబోతున్నాయి. తొలి రోజు నుంచి నిరసనలు హోరెత్తించే విధంగా ప్రతి పక్షాలు ముందుకు సాగబోతుండడంతో అసెంబ్లీ, సచివాలయం పరిసరాలలో భద్రతను కట్టదిట్టం చేశారు. సచివాలయం ఆవరణలోనే అసెంబ్లీ సమావేశ మందిరం ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలలోనే కాకుండా, కామరాజర్ సాలైలోనూ నిఘా పెంచారు. అదే సమయంలో ఆదివారం సచివాలయం, డీజీపీ కార్యాలయానికి బాంబు బూచీ రావడంతో పోలీసులు ఉరకలు పరుగులతో తనిఖీలు చేశారు. ముందు జాగ్రత్తగా మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు.
కొత్త సంవత్సరంలో తొలి సమావేశం
ప్రసంగించనున్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
భద్రత కట్టుదిట్టం
బాంబు బూచీతో తనిఖీలు ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment