మున్సిపాలిటీలో విలీనం చేయొద్దంటూ రాస్తారోకో
తిరువళ్లూరు: ఈకాడు గ్రామాన్ని తిరువళ్లూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు శనివారం సాయంత్రం రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు..తిరువళ్లూరు యూనియన్ పరిధిలో ఈకాడు గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 2వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే ఈకాడు, కాకలూరు, పుట్లూరు, సేలైతో పాటు 9 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు విలీన ప్రక్రియను ప్రభుత్వం డిసెంబర్ 31న ప్రారంభించింది. ఈ క్రమంలో తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని కోరుతూ గ్రామస్తులు శనివారం సాయంత్రం రాస్తారోకోకు దిగారు. పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఉపాధి పనులు రద్దు కావడంతో పాటూ ఇంటి పన్ను, ఆదాయపన్ను, ల్యాండ్ టాక్స్, డెవలప్‌మెంట్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని తద్వారా తమ గ్రామంలోని నిరుపేదలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని వాపోయారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటిలో విలీనం చేయాలన్న ప్రతిపాదననూ వెంటనే విరమించుకోవాలని కోరుతూ నినాదాలు చేస్తూ రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, గ్రామీణాబివృద్ధి అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. అయితే తమకు స్పష్టమైన హమీ లభించే వరకు ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పిన గ్రామస్తులు ఆందోళననూ కొనసాగించారు. ఈ సందర్భంగా బీడీఓ మాణిక్యం జోక్యం చేసుకుని తమకు రాత పూర్వకంగా గ్రామస్తులు ఫిర్యాదు అందిస్తే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లుతామని ఇచ్చిన హమీతో గ్రామస్తులు శాంతించి ఆందోళనను విరమించారు. కాగా గ్రామస్తుల రాస్తారోకోతో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment