భారీగా నగదు సీజ్?
● మంత్రి దురై మురుగన్ టార్గెట్‌గా కొనసాగుతున్న ఈడీ సోదాలు ● ఇల్లు, కళాశాలలో పలు కీలక పత్రాలు స్వాధీనం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి గాంధీనగర్‌లోని డీఎంకే పార్టీ సీనియర్ మంత్రి దురై మురుగన్ ఆయన కుమారుడు వేలూరు పార్లమెంట్ సభ్యులు కదీర్‌ఆనంద్‌కు సొంతమైన ఇల్లు, కళాశాల, అనుచరుల ఇళ్లలో రెండు రోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయితే మంత్రి దురై మురుగన్ చైన్నెలో ఉండగా ఎంపీ కదీర్ ఆనంద్ ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఈడీ అధికారులు ఫోన్ చేయడంతో అతని అనుచరులు ఐదుగురిని పంపి అధికారులను ఇంటిలోకి అనుమతించారు. అనంతరం అధికారులు రాత్రి పూర్తిగా తనిఖీలు చేపట్టారు. కాట్పాడి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల, పాఠశాలలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి ఈడీ అధికారులు సుత్తి, ఇనుప ఆపు వంటి వాటిని ఇంటిలోనికి తీసుకెళ్లడంతో అక్కడే ఉన్న కార్యకర్తలు వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం వారి కళాశాలకు బ్యాంక్ నుంచి వ్యాన్ వచ్చి వెళ్లడంతో భారీగా నగదు పట్టు బడిందా? కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారా? అనే విషయాలు సంచలనం రేపుతుంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయం ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చిన విద్యార్థులు, ఫ్రొఫెసర్‌లను పోలీసులు తనిఖీ చేసి లోనికి అనుమతించారు. రెండు రోజుల పాటు ఇల్లు, ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఈడీ అధికారులు మంత్రికి సొంతమైన ప్రాంతాల్లో తనిఖీలు చేయడంతో కార్యకర్తలు రెండు రోజుల పాటు మంత్రి ఇంటి వద్దనే ఉంటున్నారు. కార్యకర్తలకు ఆహారం, నీటిని ఆయన పార్టీ ప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment