ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
అన్నావర్సిటీ క్యాంపస్‌లో జరిగిన లైంగిక దాడి వ్యవహారాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని పలువురి నాయకులను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ గుండెల మీద చేయి వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సున్నితమైన అంశాల్లో పరిణితితో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే కేవలం మహిళలకే కాకుండా మగాళ్లకూ అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిసిటీ కోసం నిరసనలు చేపట్టాలనుకోవడం సమంజసం కాదన్నారు.
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీలో ఇటీవల ఓ విద్యార్థి నిపై జరిగిన లైంగిక దాడిని ప్రతిపక్షాలు అస్త్రంగా తీసుకుని పోరాటాలు ఉధృతం చేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగానికి తోడుగా బుధవారం పీఎంకే సైతం పోరుబాట పట్టింది. అయితే వీరి ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళనకు దిగిన ఆ పార్టీ మహిళా నేత సౌమ్య అన్బుమణితో పాటూ మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ఖండించారు. ఈ పరిస్థితులలో తమ ఆందోళనకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంటూ ఆ పార్టీ తరపున న్యాయయవాది బాలు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. తమ నిరసనకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ సమయంలో న్యాయమూర్తి తీవ్రంగానే స్పందించారు.
గుండెల మీద చేయి వేసుకోండి..
మహిళల భద్రతపై దృష్టి పెట్టకుండా, అన్నావర్సిటీ కేసును ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలు చేసే ప్రతి ఒక్కరూ తమ గుండెలపై చేయి వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎంత మంది మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన జరిగినందుకు అందరూ సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సమస్యను పబ్లిసిటీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసిందని, పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేస్తూ, ఇలాంటి పరిస్థితులలో నిరసనలు అవసరమా? అని ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఈ నిరసనలు నిర్వహిస్తున్నట్టున్నారని మండిపడ్డారు. వేధింపులు ఒక్క చోటే లేదని, అన్ని చోట్లా ఉన్నాయంటూ మహిళలకు వ్యతిరేకంగా ఘఽటనలు జరిగితే పోరాటాలు చేస్తున్నారని, అదే ఒక మగవాడికి అన్యాయం జరిగితే పోరాటాలు ఎందుకు చేయడం లేదని రాజకీయ పక్షాలను ప్రశ్నించారు. ఇక్కడ కూడా సీ్త్ర, పురుషుడు అన్న భేదం చూపిస్తున్నారని, నష్టం అనేది అందరికీ నష్టమేనని, ఈ వ్యవహారంలో సిగ్గు పడి తల దించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయ వద్దని, అనమతుల విషయం పోలీసులు నిర్ణయం తీసుకుంటారని, కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.
తగ్గేదే లేదా..?
కోర్టు అక్షింతలు వేసినా ఈ వ్యవహారంలో రాజకీయ పక్షాలు తగ్గేట్టు లేదు. డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా పోరాటాలను ఉధృతం చేసిన బీజేపీ శుక్రవారం మదురై టూ చైన్నె నిరసన ర్యాలీకి సిద్ధమైంది. బీజేపీ మహిళా మోర్చా నేతృత్వంలో మదురై నుంచి చైన్నె వరకు భారీ నిరసన ర్యాలీతో గవర్నర్‌ఆర్‌ఎన్ రవిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం మదురైలో పది గంటల సమయంలో ప్రారంభమయ్యే ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పీఎంకే నిరసన వ్యవహారంలోనే కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపీ వర్గాలు అనుమతి కోసం కోర్టు తలుపు తట్ట లేని పరిస్థితి. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు మదురై నుంచి నిరసనకు యాత్రకు సిద్ధం కావడంతో పోలీసులు అడ్డుకునేందుకు బలగాలను మొహరించారు. అదే సమయంలో తాము సైతం పోరాటబాట అంటూ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ముందుకు వచ్చారు. అన్నావర్సిటీ వ్యవహారంపై ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళనలకు పిలుపు నిచ్చారు. కాగా ఈ కేసును సిట్‌కు అప్పగించిన నేపథ్యంలో చైన్నె కోర్టు నుంచి మహిళా కోర్టుకు త్వరలో విచారణను బదిలీ చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. అలాగే విద్యాసంస్థలలో విద్యార్ధినులకు భద్రతకల్పనతో పాటూ లోనికి ఇతరులు ప్రవేశించకుండా బయోమెట్రిక్ విధానం అనుసరించే దిశగా ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇదిలా ఉండగా ఈ కేసులో ఎవరో ఆ సారు అంటూ ప్రశ్న ఉత్పన్నమైన నేపథ్యంలో వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, ఎవరో ఆ సారు.. అనుమానం ఉంటే, నిజాయితీతో విచారణ చేపట్టాలని కోరారు.
న్యూస్‌రీల్
అన్నావర్సిటీ లైంగిక దాడి ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజకీయ పక్షాలకు హితవు
నిషేదాజ్ఞలు ఉల్లంఘించి పీఎంకే నిరసన
సౌమ్య అన్బుమణి సహా పలువురి అరెస్టు
బీజేపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment