క్యూఆర్‌ కోడ్‌తో రైలు టికెట్‌ కొనుగోలుకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌తో రైలు టికెట్‌ కొనుగోలుకు అవకాశం

Published Sun, Oct 20 2024 2:56 AM | Last Updated on Sun, Oct 20 2024 2:56 AM

క్యూఆర్‌ కోడ్‌తో రైలు టికెట్‌ కొనుగోలుకు అవకాశం

అన్నానగర్‌: డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా చైన్నె డివిజన్‌లోని రైల్వే స్టేషన్లలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రైలు టిక్కెట్లు తీసుకునే విధానాన్ని తాజాగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రయాణికులు డిజిటల్‌ లావాదేవీల ద్వారా రైల్వే స్టేషన్లలో అన్‌ రిజర్వ్‌డ్‌ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్‌ టిక్కెట్లు, పార్సిల్స్‌ టిక్కెట్లు, ఇతర సేవలకు రుసుము చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఫలితంగా ప్రయాణికులు ఎక్కువ సమయం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

శ్రీలంక జైలు నుంచి 17 మంది జాలర్ల విడుదల

సేలం : శ్రీలంక చరలో ఉన్న 17 మంది జాలర్లు విడుదలై శనివారం చైన్నెకి చేరుకున్నారు. వివరాలు.. రాష్ట్రంలో రామేశ్వరం ప్రాంతం నుంచి ఈఏడాది సెప్టెంబర్‌ 29న 17 మంది జాలర్లు పడవల్లో చేపల వేటకు వెళ్లారు. వేకువజామున సముద్రంలో చేపల వేటలో నిమగ్నమై ఉండగా అక్కడికి వచ్చిన శ్రీలంక సముద్రతీర బలగాలు 7 మంది జాలర్లను అరెస్టు చేశాయి. వారి పడవలను, వలలను స్వాధీనం చేసుకుని, జాలర్లను శ్రీలంకకు తీసుకువెళ్లారు. అక్కడ శ్రీలంక కోర్టులో హాజరు పరిచి 17 మంది జాలర్లను జైలులో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ అత్యవసరంగా ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖలు రాసి అరెస్టు అయిన జాలర్లను, వారి పడవలను విడిపించడానికి చర్యలు చేపట్టారు. దీంతో శ్రీలంకలో ఉన్న భారత దౌత్యాధికారులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో శ్రీలంక కోర్టు రామేశ్వరం 17 మంది జాలర్లను విడుదల చేసి, భారత దౌత్యాధికారులకు అప్పగించింది. అక్కడి నుంచి విమానం ద్వారా శనివారం చైన్నె విమానాశ్రయానికి వచ్చిన జాలర్లకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఆహ్వానం పలికారు. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలలో రామేశ్వరానికి తరలించారు.

చెరుకు రైతులకు రూ. 247 కోట్లు

సాక్షి, చైన్నె: చెరుకు రైతులకు రూ. 247 కోట్ల ప్రోత్సాహక నగదును రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు, చెరుకు సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉండటంతో వారిని మరింత ప్రోత్సహించే విధంగా, చక్కెర పరిశ్రమ సామర్థ్యం పెంపు దిశగా సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు ఈ ప్రోత్సాహకం విడుదల చేశారు. 2023–24 చక్కెర మిల్లులకు చెరకు సరఫరా చేసిన వివరాల మేరకు చెరుకు రైతుల ప్రయోజనాలకు పై మొత్తం ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. 1.20 లక్షల మంది రైతులకు ఈ ప్రోత్సాహకం మేలు చేకూర్చుతుందని ప్రకటించారు.

మాజీ మంత్రి బలి పీఠ పూజ

కొరుక్కుపేట: తన మీద వస్తున్న ఆరోపణలు, వదంతులు నశించిపోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వైద్యలింగం బలిపీఠ పూజ నిర్వహించారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన అనంతరం మాజీ సీఎం పన్నీర్‌ సెల్వంకు మద్దతుగా సీనియర్‌ నేత వైద్యలింగం వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంగా ఆయనపై అక్రమ ఆరోపణలు, అనేక వదంతులు బయలుదేరాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఏసీబీ ద్వారా ఆయనపై కేసుల నమోదు దిశగా ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ పరిస్థితుల్లో తనకు ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో నాగపట్నం జిల్లా శీర్గాళిలో ఉన్న బ్రహ్మపురీశ్వరర్‌ ఆలయంలో శనివారం మాజీ మంత్రి బలిపీఠ పూజలు నిర్వహించడం గమనార్హం.

టీఎన్‌ బీజేపీలో సంస్థాగత సమరం

కమిటీ ఏర్పాటు

సాక్షి, చైన్నె: తమిళనాడులో బీజేపీలో సంస్థాగత ఎన్నిలకు జరగనున్నాయి. ఇందుకోసం కమిటీని ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ బలోపేతం దిశగా నాయకులు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఇది ముగియగానే సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కమిటీని ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. నాయకులు సెల్వకుమార్‌, మీనాక్షి నిత్యా సుందర్‌, కె.నర్సింహ పెరుమాల్‌లు సహాయక ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ వివరాలను శనివారం రాష్ట్ర బీజేపీ సమన్వయ కమిటీ చైర్మన్‌ హెచ్‌.రాజా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement