తిరుత్తణిలో నేడు స్కంధషష్టి
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్కంధషష్టి ఉత్సవాలు శనివారం ఉదయం లక్షార్చనతో ప్రారంభం కానున్నాయి. దీంతో మురుగన్ భక్తులు మాలధారణ చేసి స్కంధషష్టి వ్రతం ప్రారంభిస్తారు. మురుగన్ ఆలయాల్లో దీపావళి మరుసటి రోజు స్కంధషష్టి ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం వేకువజామున మూలవర్లకు పుష్పాలంకరణతో మహాదీపారాధన పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు కావడి మండపంలో వళ్లిదేవసేన సమేత ఉత్సవమూర్తికి లక్షార్చనతో స్కంధషష్టి వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఏడు రోజుల పాటు స్వామికి లక్షార్చన పూజలు నిర్వహిస్తారు. 7న సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే పుష్పాలతో స్వామికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. మురుగన్ ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
పిడుగుపడి
మహిళ సజీవ దహనం
సేలం: పిడుగు పడి ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ సంఘటన తూత్తు కుడి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లా పట్టణ పంచాయతీకి చెందిన అన్నరాజ్. ఈయన అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు కంపెనీలో వాచ్‌మన్. ఇతని భార్య అన్నతంగం (47). ఆ ప్రాంతంలో ఉపాధి పనికి వెళుతున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఎప్పటిలాగానే అన్నతంగం ఉపాధి హామీ పనికి వెళ్లారు. ఆసమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఉపాధి పనికి వెళ్లిన మహిళలు అందరూ ఇళ్లకు బయలుదేరారు. వాలవంద అమ్మన్ ఆలయం వద్ద వెళుతుండగా అక్కడ ఉన్న అత్తిచెట్టుపై పిడుగు పడి అన్నతంగంను తాకింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె సజీవ దహనమైంది. ఆమెతో వస్తున్న కొంతమంది మహిళలు స్పృహ తప్పారు. తట్టపారై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళా ఎస్‌ఐ దుర్మరణం
సేలం: కోవై జిల్లా పొల్లాచ్చి సమీపంలోని కోట్టూర్ పోలీసుస్టేషన్‌లో కృష్ణవేణి (52)ఎస్‌ఐ. ఈమె గురువారం అంగాలకురిచ్చి నుంచి కోట్టూర్ పోలీసుస్టేషన్‌కు బైక్‌లో బయలుదేరింది. మార్గమధ్యలో థియేటర్ సమీపంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనం అదుపుతప్పి కృష్ణవేణి బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో కృష్ణవేణి తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను స్థానికులు పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. పొల్లాచ్చి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా జడ్జికి వేధింపులు
● న్యాయవాదిపై నిషేధం
● తమిళనాడు బార్ కౌన్సిల్ ఉత్తర్వులు
కొరుక్కుపేట: మహిళా జడ్జిని వేధించిన విల్లుపురానికి చెందిన న్యాయవాదిని లాయర్‌గా ప్రాక్టీస్ చేయకుండా తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సి ల్ నిషేధం విధించింది. విల్లుపురం న్యాయవాది శివరాజ్‌పై మద్రాస్ హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపారు. దీంతో తమిళనాడు జిల్లా కోర్టులోని క్రమశిక్షణ కమిటీ అడ్వకేట్ శివరాజ్ లాయర్‌గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధించారు. అలాగే తమిళనాడులోని అన్ని ట్రిబ్యునల్‌లు, అన్ని రాష్ట్ర న్యాయస్థానాల్లో హాజరుకాకుండా నిషేధం విధించారు.
ఊటీలో పెరిగిన
పర్యాటకుల సంఖ్య
కొరుక్కుపేట: నీలగిరి జిల్లాలోని ఊటీ రైలులో ప ర్యాటకుల సంఖ్య పెరిగింది. శనివారం, ఆదివా రం కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. దీపావళి సందర్భంగా సెలవులు కావడంతో నీలగిరి జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. కూనూర్ సిమ్స్‌పార్క్, లైమ్స్ రాక్, డాల్ఫిన్ నోస్ సహా పర్యాటక కేంద్రాలు పర్యాటకులతో కిక్కిరిశాయి. ఊటీ హిల్స్ రైలు ఇప్పటికే అన్ని సీట్లు బుక్ అయ్యాయి. ఊటీ– కూనూర్ మధ్య నడిచే హిల్ రైళ్ల సంఖ్యను పెంచడంతో మరింత మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఈ కూనూర్ నుంచి ఊటీకి ఉదయం 8.20 గంటలకు, ఊటీ నుంచి కూనూర్ వరకు సాయంత్రం 4.45 గంటలకు రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఊటీ, కాథీ మధ్య రౌండ్ ట్రిప్ జాయ్ ప్రత్యేక రైలు ఉదయం 9.45, ఉదయం 11.35లకు, మధ్యాహ్నం 3 గంటలకు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment