సముద్రతీరంలో పుదుచ్చేరి విముక్తి రోజు
● సరిహద్ధు పోరాటయోధులకు సీఎం నివాళి
సాక్షి, చైన్నె: ఫ్రెంచ్ వారి గుప్పెట్లో నుంచి విముక్తి కలిగిన రోజును పుదుచ్చేరిలో శుక్రవారం నిర్వహించారు. సముద్ర తీరంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రంగస్వామి పాల్గొన్నారు. తమిళనాడులో నవంబర్ 1వ తేదీని సరిహద్దు పోరాటయోధులకు నివాళులర్పించే విధంగా సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి ఒకప్పుడు ఫ్రెంచ్ వారి గుప్పెట్లో ఉన్న విషయం తెలిసిందే. 1954 నవంబర్ 1న ఫ్రెంచ్ వారి చేతుల్లో నుంచి పుదుచ్చేరికి విముక్తి కలిగింది. దీంతో ఈరోజును ప్రతి సంవత్సరం పుదుచ్చేరి విడుదలై నాల్( విముక్తి రోజు)గా జరుపుకుంటూ వస్తున్నారు. శనివారం సముద్రతీరంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహం వద్ద సీఎం రంగస్వామి జాతీయజెండాను ఎగుర వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
తమిళనాడులో
భారతదేశం 1956 నవంబరు 1న భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇదే రోజున మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ (కొన్ని ప్రాంతాలు) రాష్ట్రాలుగా విడిపోయాయి. నవంబరు 1న తమిళనాడు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణించాలని 2019లో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. నవంబరు 1వ తేదీని పోరాట దినంగా పరిగణించాలే గానీ అవతరణ దినోత్సవంగా భావించడం సరికాదని డీఎంకేతో పాటు అనేక రాజకీయపార్టీలు, తమిళ సంఘాలు, విద్యావేత్తలు, తమిళభాషాభిమాన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాయి. మద్రాసు ప్రెసిడెన్సీ అనే పేరును తమిళనాడుగా మారుస్తూ 1967 జూలై 18న అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజే తమిళనాడు దినోత్సవంగా భావించాలని నినదిస్తూ వచ్చారు. డీఎంకే అధికారంలోకి రాగానే అన్నాడీఎంకే ఉత్తర్వులు రద్దు చేసి కొత్తగా ప్రకటన చేసింది. జూలై 18వ తేదీనే తమిళనాడు డేగా భావించాలని, నవంబర్ 1వ తేదీని సరిహద్దు పోరాటయోధులు, అమరులైన వారికి నివాళులర్పించే రీతిలో సరిహద్దు పోరాటయోధుల దినోత్సవంగా భావించాలని ప్రకటించింది. దీంతో ఈ మేరకు సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ అయితే, తమిళనాడు డేగా పేర్కొంటూ, శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. తమిళ ప్రాంతాలను తమిళనాడులోకి చేర్చేందుకు జరిగిన పోరాటంలో సరిహద్దు పోరాట యోధుల త్యాగాలను ఈ రోజున స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment