ప్రాణం తీసిన సరదా
● తేనిలో రెండు బైకులు ఢీ ● ముగ్గురు యువకుల దుర్మరణం
సేలం: దీపావళి పండుగ సందర్భంగా ఐదుగురు స్నేహితులు సరదాగా బైకుల్లో వెళుతుండగా బైక్‌లు ఒకదానికొకటి ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన గురువారం తేనిలో చోటుచేసుకుంది. తేని జిల్లా కంబం సమీపంలోని కూడలూరు జాతీయరహదారిపై రెండు బైకుల్లో ఐదుగురు యువకులు అతి వేగంగా వెళుతున్నారు. ఆ సమయంలో అదుపుతప్పి రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి కూడలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు విచారణ చేశారు. విచారణలో ప్రమాదానికి గురైన ఐదుగురు యువకులు కూడలూరులో ఒకే వీధికి చెందిన లింగేశ్ (24), సేవాగ్ (23), సంజయ్ (22), మోనిష్ (22), కేశవన్ (22) అని తెలిసింది. దీపావళి సందర్భంగా మద్యం తాగి, రెండు బైక్‌ల్లో ఐదుగురు ఎక్కి సరదాగా ఆడుతూ, అతి వేగంగా నడపవడం వల్లనే ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. ఈప్రమాదంలో లింగేష్, సేవాగ్, సంజయ్ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మోనిష్, కేశవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment