ఆ రెండు పార్టీలే మన టార్గెట్!
సాక్షి, చైన్నె: డీఎంకే, బీజేపీని తప్ప ...మరే పార్టీని విమర్శించ వద్దని నేతలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సూచించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకే, బీజేపీ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక పాలనను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యాచరణతో పాటు రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజక వర్గాలలో పర్యటన దిశగా రూట్ మ్యాప్ రూపకల్పనకు అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల భేటీలో బుధవారం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి పదిన్నర గంటల సమయంలో హాజరైన పళణి స్వామికి బ్రహ్మరథం పట్టే విధంగా పార్టీ వర్గాలు ఆహ్వానించాయి. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించినానంతరం సమావేశ మందిరంలోకి పళణి వెళ్లారు.
రెండు పార్టీలే టార్గెట్..
పార్టీ ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్‌హుస్సేన్, కోశాధికారి దిండుగల్ శ్రీనివాసన్, సంయుక్త కార్యదర్శులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పార్టీ నిర్వాహక కార్యదర్శి ఎస్పీ వేలుమణితో పాటు పార్టీ పరంగా ఉన్న 82 జిల్లాలలో 81 జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులు, ఇటీవల అన్ని జిల్లాలకు పంపించిన సభ్యత్వ గుర్తింపు కార్డుల జారీ గురించి ముందుగా చర్చించారు. అన్ని జిల్లాలకు సభ్యత్వ కార్డులు చేరడం, సభ్యులకు పంపిణీ వేగంగా జరుగుతుండడం గురించి ప్రధాన కార్యదర్శి దృష్టికి కార్యదర్శులు తీసుకెళ్లారు. అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికల గురించి చర్చించారు. త్వరితగతిన సంస్థాగత ఎన్నికలను ముగించే విధంగా కార్యాచరణ రూపకల్పనకు నిర్ణయించారు. డిసెంబరులో జరగనున్న పార్టీ సర్వ సభ్య సమావేశం, కార్యవర్గ సమావేశం నిర్వహణ ఏర్పాట్లు కసరత్తులకు సిద్ధమయ్యారు.
ఆ రెండు పార్టీలను తప్పా..
2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పార్టీ వర్గాలు సమాయత్తం కావాలని, కార్యక్రమాలను విస్తృతం చేయాలని పళణి స్వామి ఆదేశించారు. జిల్లాల కార్యదర్శుల నేతృత్వంలో కార్యక్రమాలు విస్తృతం కావాలని, అన్ని నియోజకవర్గాలలో జిల్లాల కార్యదర్శులు పర్యటించే విధంగా సూచనలు ఇచ్చారు. బీజేపీ, డీఎంకేను తప్పా, మరే పార్టీని విమర్శించ వద్దని, ప్రధానంగా డీఎంకే కూటమిలోని పార్టీలను పల్లెత్తి మాట అన కూడదని నేతలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా పళణి ఉపదేశించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకే, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలన్నీ అస్త్రంగా చేసుకుని ప్రజలో విస్తృతంగా ప్రచారం చేయాలని, చిన్న అస్త్రం దొరికినా ఆ రెండు పార్టీలను ఢీకొట్టే విధంగా నేతలు దూసుకెళ్లాలని సూచించడం గమనార్హం. ఈ సమావేశానంతరం పార్టీ సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమిలో పొగ రేగిన మాట వాస్తవమేనని, ఇది మరి కొద్ది రోజులలో చిచ్చుకాబోతోందన్నారు. అయితే తమ కూటమి బలంగా ఉందని డీఎంకే నాటకాలు ఆడుతోందన్నారు. గత చరిత్రను ఓ మారు తిరగ వేస్తే కూటమి లెక్కల గురించి అర్థం అవుతుందని ఈ సందర్భంగా డీఎంకే కూటమి బలం గురించి మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరని, లెక్కించ లేరని అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలలు సమయం ఉందని, ఇంతలోపు ఎలాంటి మార్పులు జరుగుతాయో అన్నది వేచి చూడండీ అని వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలకు పళణి స్వామి ఆదేశించారని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమను విమర్శించేందుకు ఎలాంటి అస్త్రాలు, ఆరోపణలు లేవు అని, అందుకే విజయ్ తమను విమర్శించ లేదన్నారు. అన్నాడీఎంకే ప్రజా హిత పాలనను అందించిన విషయం ప్రతి ఒక్కరికి ఎరుకే అని వ్యాఖ్యానించారు. డీఎంకేను అందరూ విమర్శిస్తున్నారని అయితే, సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం స్టాలిన్ మాత్రం పొగడ్తల పన్నీరు చల్లుకుంటూ ముందుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, నిర్దోషులుగా విడుదల అవుతామని వ్యాఖ్యానించారు. 2026లో అన్నాడీఎంకే అధికారంలో రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
నేతలకు పళణిస్వామి ఉపదేశం
పార్టీ సంస్థాగత ఎన్నికలకు కార్యాచరణ
234 నియోజకవర్గాల పర్యటనకు రూట్ మ్యాప్
పార్టీ జిల్లా కార్యదర్శుల భేటీలో చర్చ
Comments
Please login to add a commentAdd a comment