రూ. 12.60 కోట్లతో పోరూర్‌లో గ్రీన్‌ పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

రూ. 12.60 కోట్లతో పోరూర్‌లో గ్రీన్‌ పార్క్‌

Published Thu, Nov 7 2024 1:32 AM | Last Updated on Thu, Nov 7 2024 1:31 AM

రూ. 12.60 కోట్లతో  పోరూర్‌లో గ్రీన్‌ పార్క్‌

రూ. 12.60 కోట్లతో పోరూర్‌లో గ్రీన్‌ పార్క్‌

కొరుక్కుపేట: పోరూర్‌లో చైన్నె మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తరపున రూ.12.60 కోట్లతో గ్రీన్‌ పార్కును నిర్మించనున్నారు. బుధవారం ఈ గ్రీన్‌ పార్కు నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర హిందూ ధార్మిక శాఖ మంత్రి, చైన్నె మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ చైర్మన్‌ పీకే శేఖర్‌బాబు అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. వీరి వెంట ఎమ్మెల్యే గణపతి, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, సీఎండీఏ సభ్య కార్యదర్శి అన్సుల్‌ మిశ్రా తదితరుల ఉన్నారు. 16.60 ఎకరాల విస్తీర్ణంలోని ఈ గ్రీన్‌పార్క్‌లో 103 సీట్లు, ఫుట్‌పాత్‌, ఇటుక పేవ్‌మెంట్‌, కాంక్రీట్‌ వాక్‌వే, బాస్కెట్‌బాల్‌ ప్లేగ్రౌండ్‌, ఆల్‌–పర్పస్‌ ప్లేగ్రౌండ్‌, 6.85 ఎకరాల సరస్సు, ఓపెన్‌–ఎయిర్‌ జిమ్నాసియం అందుబాటులో ఉంటాయని పార్కింగ్‌ సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, సీసీ కెమెరా సౌకర్యం సహా పలు సౌకర్యాలతో గ్రీన్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంలో గ్రీన్‌ పార్కు పనులను మంత్రి శేఖర్‌బాబు పరిశీలించారు. అనంతరం పార్కు పనులు, పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని, పార్కులో అదనపు లైటింగ్‌, భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేఽశించారు.

చేతివృత్తి దారులకు ప్రోత్సాహం!

సాక్షి, చైన్నె: చేతివృత్తి దారులు, వారి వారసత్వ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ విభాగం చైన్నె చైర్‌పర్సన్‌ దివ్య అభిషేక్‌ తెలిపారు. ఈ విభాగం నేతృత్వంలో హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌లో ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్‌ తరుణ్‌ తహిలియాని అధ్యక్షతన బుధవారం స్థానికంగా చిరస్మరణీయంగా ‘జమకాలం రీవోవెన్‌’ అనే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. నీలగిరులలోని గిరిజ మహిళా కళాకారులతో సాంప్రదాయ, ఎంబ్రాయిడరీతో ‘తోడా థ్రెడ్స్‌ – విమెన్‌ ఆఫ్‌ ది నీలగిరిస్‌’ పేరిట ఇందులో ప్రత్యేక ప్రాజెక్టును ఆవిష్కరించారు. ‘‘జమకాలం రీవోవెన్‌’’ ప్రాజెక్ట్‌తో, జమకలం రగ్గు క్రాఫ్ట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దివ్య అభిషేక్‌ మాట్లాడుతూ చేతి వృత్తిదారుల వస్త్రాలు, తమిళనాడు వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుకెళ్తామన్నారు. చేతి వృత్తి కళాకారులకు మద్దతు, గుర్తింపునకు, ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సంప్రదాయ, వైవిధ్యమైన క్రాఫ్ట్‌ వారసత్వాన్ని చాటే విధంగా ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో హ్యాండ్‌ లూమ్‌ అండ్‌ టెక్స్‌ టైల్స్‌ రంగానికి చెందిన ఆర్తీ బాగ్డీ, వర్షా రహేజా నబీలాల పాల్గొన్నారు.

పరీక్షకు అనుమతించాలి

చైన్నె హైకోర్టు ఆదేశం

కొరుక్కుపేట: 2022–2023 సంవత్సరానికి అదనపు ట్యూషన్‌ ఫీజు వసూలు చేసినందుకు కళాశాలపై ఫిర్యాదు చేసిన విద్యార్థినిని సెమిస్టర్‌ పరీక్ష రాయడానికి అనుమతించాలని చైన్నె హైకోర్టు బుధవారం ఆదేశించింది. చైన్నెలోని వేలచ్చేరిలో ఉన్న గురునానక్‌ కళాశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయడంతో ఆ కాలేజీకి చెందిన లోకేశ్వరి అనే విద్యార్థిని చైన్నె హైకోర్టులో కేసు వేసింది. 2022లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ కోసం రెండేళ్లలో ట్యూషన్‌ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించిన రూ.53,825 విద్యా రుసుం కంటే రూ.లక్ష అదనంగా వసూలు చేశారని పేర్కొన్నారు. కేవలం 2023–2024 విద్యా సంవత్సరంలోనే దాదాపు 2500 మంది విద్యార్థుల నుంచి రూ.15 కోట్లు ఫీజును అక్రమంగా వసూలు చేశారు. తమిళనాడు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ 2007లో ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న ప్రైవేట్‌ కళాశాలల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీకి ట్యూషన్‌ ఫీజును మినహాయిస్తూ ఆర్డినెన్‌న్స్‌ జారీ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ చైన్నె వేలాచ్చేరిలోని గురునానక్‌ కళాశాల యాజమాన్యం అదనపు ఫీజులు వసూలు చేయడంపై హైకోర్టులో కేసు వేయడంతో కళాశాల మూడో సంవత్సరం టర్మ్‌ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి పట్టు దేవానినంద్‌ నవంబర్‌ 6 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న కళాశాలలో మొదటి సెమిస్టర్‌ పరీక్ష రాయడానికి విద్యార్థిని లోకేశ్వరిని అనుమతించాలని ఆదేశిస్తూ వేలాచ్చేరి గురునానక్‌ కళాశాలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి కేసును వాయిదా వేశారు.

చైన్నె, నైల్లెలో ఐటీ సోదాలు

సాక్షి, చైన్నె : చైన్నె, తిరునల్వేలిలో పలు చోట్ల బుధవారం ఐటీ సోదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఉన్న ఓ ఎక్స్‌పోర్టు సంస్థకు చైన్నె, శివారులో కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉదయాన్నే పలు బృందాలుగా ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాల్లో నిమగ్నమయ్యారు. చైన్నె సెంట్రల్‌, రెడ్‌ హిల్స్‌, ఐసీఎఫ్‌, గుమ్మిడి పూండి తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. అలాగే, తిరునల్వేలిలోని ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో, కార్యాలయాలల్లో ఐదు చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement