అదృశ్య కేసులపై సత్వర విచారణ
● డీజీపీ ఆదేశాలు
సాక్షి, చైన్నె: అదృశ్య కేసులపై నిర్లక్ష్యం వద్దని, సత్వరం విచారణను చేపట్టాలని అన్ని జిల్లాల ఎస్పీలను డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అనేక పోలీసు స్టేషన్లలో అదృశ్య కేసులపై విచారణలు జరగడం లేదని, ఫిర్యాదులు స్వీకరించడం లేదన్న ఆరోపణలు వస్తూ ఉన్న విషయం తెలిసిందే. అదృశ్యం అంటేనే పోలీసులు ఏదో ఒక సాకులు చెప్పడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారంపై డీజీపీ శంకర్‌జివ్వాల్ దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేస్తూ, అన్ని జిల్లాలోని పోలీసు స్టేషన్లలో తప్పనిసరిగా అమలయ్యే విధంగా చర్యలకు సూచించారు. ఎవరైనా అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందగానే తక్షణం సీఎస్‌ఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని సూచించారు. అదృశ్యమైన ప్రదేశం లేదా సంబంధిత వ్యక్తి తరచూ వెళ్లి వచ్చే ప్రదేశాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలోని నిఘా నేత్రాలను పరిశీలించి కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదృశ్యమైన వారి ఫొటోలు, సంబంధిత బంధువులు, పోలీసు స్టేషన్ పోన్ నంబర్లతో పోస్టర్లను ఏర్పాటు చేయించాలని సూచించారు. సీఎస్‌ఆర్ నమోదు, విచారణ తదుపరి 24 గంటలలో సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు. అదృశ్య కేసులో నిర్లక్ష్యం మాత్రం వద్దని, విచారణను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment